Politics

ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్‌ సింగ్

ఎన్‌డీఏ  ఉప రాష్ట్రపతి   అభ్యర్థిగా అమరీందర్‌ సింగ్

ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ ను తమ అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 80 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేషన్ వేసే చివరి తేదీ జూలై 19 కాగా, ఎన్నికలు ఆగస్టు 6న జరుగుతాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. దీనికి ముందే ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, లండన్ నుంచి అమరీందర్ సింగ్ తిరిగి రాగానే తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశాలున్నాయి. దీనిపై పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, ఇందుకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ బీజేపీ సీనియర్ నేత హర్జి సింగ్ గ్రెవాల్ శనివారంనాడు తెలిపారు. లండన్‌కు వెళ్లే ముందే తన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉందని సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారని, లండన్ నుంచి రాగానే పార్టీ విలీనంపై ప్రకటన చేస్తారని గ్రెవాల్ చెప్పారు.గత ఏడాది పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అమరీందర్‌ను తొలగించడంతో ఆయన ఆ పార్టీకి ఉద్వాసన చెప్పిన సొంతంగా పీఎల్‌సీ పార్టీని ఏర్పాటు చేశారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోనూ, సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సారథ్యలోని శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అయితే, పీఎల్‌సీకి చెందిన ఒక్క అభ్యర్థి కూడా ఎన్నికల్లో గెలవలేదు. అమరీందర్ సైతం పాటియాలా అర్బన్ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.