‘Ela unnaru..
Tinnara?’
‘Em chestunnav?’
..తరహా టింగ్లిష్‌లో చాట్ చేసుకుంటూ మనం మాతృభాషను మరిచిపోతుంటే..
మన ప్రాంతం కాని, మన దేశం కాని, అసలు మన ఖండానికే చెందని ఓ అమ్మాయి మాత్రం
‘ఎలా ఉన్నారు?
తిన్నారా? ఏం చేస్తున్నావ్?’
..అంటూ నిండుగా తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో టైప్ చేస్తూ, తెలుగు భాషపై
మమకారాన్ని పెంచుకుంటున్నది.
‘అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను’ ..అంటూ వేమన పద్యాన్ని వల్లెవేస్తూ
కంచు గొంతుకల మధ్య కనకమై
భాసిల్లుతున్నది. ఉదయం లేవగానే
గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నది.
పుట్టింది అమెరికాలోనే అయినా..
ఏడాదిన్నరగా తెలుగు భాషనే
శ్వాసిస్తున్నది.. బ్రీ.
అమెరికాలోని ఇండియానాలో పుట్టింది బ్రీ. నలుగురు సంతానంలో రెండో అమ్మాయి. అమ్మ ప్రభావం అపారం. పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని మంచి మాటలు, నీతి కథలు చెప్పేది ఆ తల్లి. వివిధ దేశాల సంస్కృతులు, ఆచార వ్యవహారాల గురించీ వివరించేది. ఆ బీజాలే బ్రీలో భారతీయత పట్ల జిజ్ఞాసను పెంచాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ప్రపంచ సంస్కృతుల మీద ఓ అవగాహన వచ్చింది. ఏడాదిన్నర క్రితం భారతీయ చలన చిత్రాలూ పరిచయం అయ్యాయి. ఓసారి ఓటీటీలో ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ చూసింది. తెలుగులో రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాను సబ్‌టైటిల్స్‌తో వీక్షించింది. అందులో ‘అంధులకూ అసమాన ప్రతిభ ఉంటుంది, వాళ్లను మనం గౌరవించాలి’ అనే సందేశం ఆమెకు నచ్చింది. అప్పటినుంచి తెలుగు సినిమాలు మాత్రమే చూడటం మొదలుపెట్టింది. క్రమంగా తెలుగు భాషపట్ల ఆసక్తి పెరిగింది. తెలుగు నేర్చుకోవాలని సంకల్పించింది.
ఓనమాలతో శ్రీకారం
చుట్టుపక్కల తెలుగువారెవరూ లేకపోవడంతో ‘సిలికానాంధ్ర’ను సంప్రదించింది బ్రీ. ఆ సంస్థ నిర్వహిస్తున్న ‘తెలుగు బడి’కి వెళ్లి ప్రాథమిక పుస్తకాలు, నీతికథలు తెచ్చుకుంది. మొదట్లో కష్టంగా అనిపించినా.. వెనక్కి తగ్గలేదు. భాష నేర్చుకోవడానికి పాటలు కూడా ఓ మార్గమని త్వరలోనే అర్థమైంది. దీంతో తెలుగు పాటలు వినసాగింది. ఖాళీగా ఉన్నప్పుడు పాడుకోసాగింది. అమెరికాలోని తెలుగువారిని తరచూ కలుసుకునేది. చొరవగా మాట్లాడేది. వాళ్లతో కలిసి భోంచేసేది. ఎక్కడైనా ఇద్దరు తెలుగువాళ్లు సంభాషిస్తుంటే శ్రద్ధగా వినేది. తరచూ ఆలయాలను సందర్శించేది.
అర్చకులతో మాటలు కలిపేది. తెలుగు భాష నేర్చుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ సద్వినియోగం చేసుకున్నది బ్రీ. ఆ క్రమంలో కొందరు తెలుగువారు స్నేహితులుగా మారారు. ఉదయం లేవగానే గాయత్రీ మంత్రాన్ని పఠించడం నేర్పించారు. తెలుగు వంటకాలను రుచి చూపించారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి చెప్పారు. అన్నిటికీ మించి ‘అక్కా’ అని ప్రేమగా పిలిచేవారు. ఎప్పుడైనా కడుపులో గడబిడగా అనిపిస్తే.. పొట్ట నిమురుకుంటూ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనుకుంటుంది బ్రీ. ఇది కూడా తెలుగువారు పరిచయం చేసిన అలవాటే.
దుఃఖం నుంచి ఉపశమనం
తను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించే అక్క మరణం.. బ్రీ జీవితంలో ఓ పెద్ద కుదుపు. ఆ బాధను మరిచిపోవడానికి తెలుగు భాష మీద మరింత దృష్టి సారించింది. అ, ఆ, ఇ, ఈ.. అంటూ అక్షరమాల దిద్దుకోవడం ఆరంభించింది. సాంకేతికత సాయంతో తెలుగు అక్షరాలను పలకడం మొదలుపెట్టింది. తలకట్టు నుంచి విసర్గ వరకూ ప్రతీది నేర్చుకుంది. రోజూ ఓ అక్షరాన్ని రాసుకునేది. గుణింతాలు, రెండక్షరాల పదాలు, క్రియా పదాలు నేర్చుకుంటూ అనతికాలంలోనే తప్పుల్లేకుండా తెలుగులో రాయగలిగే స్థాయికి చేరుకుంది.
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను ఎలా రాయాలో, ఎలా ప్రయోగించాలో తెలుసుకున్నది. స్నేహితులతో తన ఆన్‌లైన్ సంభాషణను రికార్డ్ చేసుకొని, దాన్ని యథాతథంగా నోట్‌బుక్‌లో రాసేది. పద సంపదను పెంచుకోవడానికి తనదైన ఓ పద్ధతిని కనిపెట్టింది. ఉదాహరణకు ఇల్లు ఒక విభాగమని అనుకుంటే.. ఇంట్లో ఏం ఉంటాయి? ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే పనిముట్లు, గృహోపకరణాల చిట్టా.. అన్నీ ఓ కాగితం మీద ఒకవైపు తెలుగులో, మరోవైపు ఇంగ్లిష్‌లో రాసుకునేది. వాహనాలు, కిరాణా సరుకులు, కూరగాయలు, సూపర్ మార్కెట్‌లో దొరికే ఆహారపదార్థాలు, అష్టదిక్కులు.. ఇలా ప్రతీది నోట్ చేసుకునేది. తెలియని వాటికోసం ఆన్‌లైన్‌లో వాకబు చేసేది. క్రమక్రమంగా బ్రీ.. తెలుగులో మాట్లాడే స్థాయికి చేరుకున్నది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలన్నది ఆమె కోరిక. ఆ దిశగానూ ప్రయత్నాలు మొదలుపెడతానని అంటున్నది.
ఉపమానాలు.. ఉప్మా!
కొత్తగా తెలుగు నేర్చుకోవాలని అనుకునేవారికి ఆన్‌లైన్‌లో సరైన వేదిక లేదని అంటున్నది బ్రీ. ఆ లోటు తీర్చడానికి డిజిటల్ గేమ్స్‌ను రూపొందిస్తున్నది. అందులో తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలు, జంతువులు, కూరగాయల పేర్లు వంటివి వివిధ విభాగాలుగా ఉంటాయి. ఏదైనా విభాగాన్ని క్లిక్ చేస్తే సంబంధిత వస్తువుల పేర్లన్నీ వచ్చేస్తాయి. సరైన సమాధానంపై క్లిక్ చేస్తేనే ముందుకెళ్తాం. ఇలా సరికొత్తగా తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తున్నది బ్రీ. ‘Bre Telugu బ్రీus’ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. అందులో తాను నేర్చుకున్న పద్యాలు, పాటలు, వంటల గురించి తెలుగులోనే చెబుతున్నది. ఇప్పుడు బ్రీకి ఉప్మా మొదలు అన్ని తెలుగు వంటకాలూ వచ్చు. తన సంభాషణల్లో చక్కని ఉపమానాలు జోడించడమూ తెలుసు.
స్క్రిప్ట్ రైటర్ అవుతా: బ్రీ
నెలరోజుల క్రితం హైదరాబాద్ వచ్చాను. తెలంగాణ బోనాల సంస్కృతి నాకు బాగా నచ్చింది. ఇటీవల గోల్కొండ వెళ్లాను. బోనాలు, నైవేద్యం, పోతురాజు గురించి తెలుసుకున్నా. హుస్సేన్‌సాగర్ బోటింగ్ బాగుంది. దుర్గం చెరువు నచ్చింది. రవీంద్రభారతి, చార్మినార్ అద్భుత కట్టడాలు. ఇక్కడి గుళ్లలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది. తెలుగు సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా, సాంగ్స్ రైటర్‌గా పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఎందుకంటే హాలీవుడ్ సినిమాల్లో స్త్రీ పాత్రలను చాలా అసభ్యంగా చూపిస్తారు. కానీ తెలుగు సినిమాల్లో చీరకట్టుతో అందంగా చూపిస్తారు. కుటుంబ బంధాల గురించి సందేశాత్మకంగా వివరిస్తారు. తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని తెలుసుకున్నా కాబట్టే.. ఈ నిర్ణయం తీసుకున్నా. నిజానికి చైనీస్, రష్యన్, ఇటాలియన్ భాషలకంటే తెలుగు చాలా సులువు. ఇక్కడి అనుబంధాలు, ఆప్యాయతలు నన్ను కట్టిపడేశాయి. హైదరాబాద్ నా రెండో జన్మభూమి.