DailyDose

చెక్క‌తో చేసిన ఈ ప‌రిక‌రంతో క‌స‌ర‌త్తు వెనుక అంత చరిత్ర ఉందా?

చెక్క‌తో చేసిన ఈ ప‌రిక‌రంతో క‌స‌ర‌త్తు వెనుక అంత చరిత్ర ఉందా?

కాలం మారింది. దానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లూ మారాయి. మొత్తంగా మన జీవన విధానమే మారిపోయింది. ఇవి చాలవన్నట్టు శారీరక, మానసిక రుగ్మతలు. నిటారుగా నిలబడలేం. అమాంతం కూర్చోలేం. స్థిమితంగా ఆలోచించలేం. ఫోన్‌ నంబర్లూ గుర్తుపెట్టుకోలేం. ఈ సమస్యకు పరిష్కారం.. కర్లకట్టయ్‌.!

శారీరక బలానికి, చురుకైన కదలికలకు, ప్రతిఘటనా శక్తికి.. సహకరించే ఒక రకమైన వ్యాయామ సాధనం కర్లకట్టయ్‌. ఇది చెక్కతో చేసిన పరికరం. తమిళనాడులో పుట్టిపెరిగిన ఈ సంప్రదాయ వ్యాయామ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. అనేకానేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగానూ పనిచేస్తున్నది. దృఢత్వానికి, ఆరోగ్యానికి దీన్ని ప్రతీకగా భావిస్తారు తమిళులు. ఆ క్రీడకు ‘కర్లకట్టయ్‌’ అనే పేరు రావడం వెనుక ఓ కథ ఉంది. శివుడి భూతగణాలకు అధిపతి కరాళన్‌. పెద్దపెద్ద వృక్షాలే అతని ఆయుధాలు. వాటితో వ్యాయామం కూడా చేసేవాడని అంటారు. తమిళంలో కట్టయ్‌ అంటే చెక్క లేదా దుంగ. కరాళన్‌ ఉపయోగించే కర్ర కాబట్టి, కరాళ కట్టెయ్‌ అయ్యింది. వ్యవహారంలో కర్లకట్టయ్‌గా మారిపోయింది. క్రమంగా అదో ఆయుధంగా రూపాంతరం చెందింది. కర్లకట్టయ్‌ కసరత్తు చోళ-పాండ్యుల కాలంనుంచే ఉంది. పురాతన దేవాలయాల్లో ఆ సాక్ష్యాలు కనిపిస్తాయి. పాలకులు, యుద్ధవీరులు సైతం కర్లకట్టయ్‌లో శిక్షణ తీసుకునేవారని అంటారు. కాలక్రమేణా సామాన్య ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది.

మహిళలకు ప్రత్యేకం
కర్లకట్టయ్‌ గ్రామీణ తమిళ మహిళల జీవితంలో ఓ భాగమైంది. చాలాచోట్ల ఒక బృందంగా ఏర్పడి శిక్షణ తీసుకుంటున్నారు. కర్లకట్టయ్‌లో మొత్తం 64 రకాల ప్రధాన సూత్రాలు ఉంటాయి. ఒక్కో సూత్రం శరీరంలోని ఒక్కో భాగం మీద ప్రభావం చూపుతుంది. ప్రతి సూత్రం ఒక అధ్యాయం లాంటిది. ఈ సాధన రోగ నిరోధక వ్యవస్థకు సాయపడుతుంది.కర్లకట్టయ్‌ అభ్యాసంలో ధ్యానం కూడా ఓ భాగమే. డాక్టర్‌ జ్యోతి సెంథిల్‌ కన్నన్‌ కర్లకట్టయ్‌ శిక్షణలో పేరు గడించారు. కర్లకట్టయ్‌ పరికరాన్ని ఔషధ కలపతో తయారుచేస్తారు. సాధన సమయంలో మూలికా తైలాలను పూస్తారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. కర్లకట్టయ్‌ సాధన శరీరంలో కదలికల్ని ప్రోత్సహిస్తుంది.

తృష- కృషి
ఈ కళలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నది తృష. డాక్టర్‌ జ్యోతి సెంథిల్‌ కన్నన్‌ దగ్గర ఈమె అక్షరాభ్యాసం చేసింది. అప్పటికి తన వయసు 24 ఏండ్లు. ఐటీ ఉద్యోగం చేసేది. అసలే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. ఇంటికి రాగానే శరీరమంతా నొప్పులు వచ్చేవి. అందులోనూ వెన్నునొప్పి వేధించేది. అదే సమయంలో 20 కిలోల బరువు పెరిగింది. మోకాళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు, మైగ్రేన్‌, డిప్రెషన్‌ వంటి సమస్యలన్నీ దరిచేరాయి. ఉద్యోగం వదిలేసిన తర్వాత, కారణాలను వెతికే పనిలో పడింది. ఐదేండ్లు దేశమంతా తిరిగింది. వివిధ ప్రత్యామ్నాయ చికిత్సలను ఆశ్రయించింది. అయినా, ఎలాంటి ప్రయోజనమూ కనిపించలేదు. చివరి ప్రయత్నంగా డాక్టర్‌ జ్యోతి సెంథిల్‌ కన్నన్‌ దగ్గర కర్లకట్టయ్‌ శిక్షణ తీసుకుంది. అంతే, కొద్ది రోజుల్లోనే సమస్యలన్నీ మటుమాయం అయిపోయాయి. ఇప్పుడు తృష ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కర్లకట్టయ్‌ శిక్షణ ఇస్తున్నది. ఎంతోమంది శారీరక, మానసిక రుగ్మతలకు తిరుగులేని పరిష్కారం చూపుతున్నది. అలా కర్లకట్టయ్‌ జీవితాలను మార్చేస్తున్నది.