ఇండియన్ బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్, మాజీ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ పుల్లేల గోపిచంద్‌కు యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం గోపిచంద్‌ను గోల్డెన్ వీసాతో సత్కరించింది. 10 ఏళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసా జారీ చేసింది. తాజాగా వీసా అందుకున్న గోపిచంద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దుబాయ్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇది యూఏఈలో నా బాధ్యతను మరింత పెంచింది. ఇక్కడ మరెన్నో ప్రత్యేక జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మా గల్ఫ్ బ్యాడ్మింటన్ అకాడమీలో పని చేయడానికి నాకు అవకాశం ఇస్తుంది. మేము గతేడాది దుబాయ్‌లో ఈ అకాడమీని ప్రారంభించడంతో పాటు అరబ్ దేశాలకు విస్తరించాము” అని చెప్పుకొచ్చారు.
కాగా, యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా గోపిచంద్ రికార్డుకెక్కాడు. ఇక గోపిచంద్ ఆట నుంచి రిటైర్ అయ్యాక 2008లో జాతీయస్థాయిలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన అకాడమీలోనే శిక్షణ పొందిన సైనా నెహ్వాల్, పీవీ సింధు, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్, గురుసాయి విష్ణు దత్ తదితర ఆటగాళ్లు బ్యాడ్మింటన్‌లో ఛాంపియన్‌లుగా మారారు. దేశానికి ట్రోఫీలు, పతకాలు సాధించి పెట్టారు. ఆయన కోచింగ్‌లోనే సైనా 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిస్తే.. 2016 సమ్మర్ ఒలంపిక్స్‌లో పీవీ సింధు రజతం గెలిచింది. అలాగే 2020 టోక్యో ఒలంపిక్స్‌లో సింధు కాంస్య పతకం సొంతం చేసుకుంది.
ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ వీసా అందుకున్న బాలీవుడ్ స్టార్స్ జాబితాలో రణవీర్ సింగ్, ఫర్హా ఖాన్, వరుణ్ ధావన్, బోనీ కపూర్ ఫ్యామిలీ, మౌనీ రాయ్, సంజయ్‌దత్, సునీల్ శెట్టి, సోను నిగమ్ ఉండగా ఇప్పుడు సల్లూభాయ్, జెనీలియా దంపతులు చేరారు. అలాగే బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు గాయని చిత్ర, తమిళ నటి త్రిష క్రిష్ణన్, నటి అమల పాల్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.