శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల్లో మొదటి రోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.రాత్రి ఊంజల్ సేవను నిర్వహించి పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, రమణయ్య ,అధికారులు, భక్తులు పాల్గొన్నారు.నిన్న స్వామివారిని 88,682 మంది భక్తులు దర్శించుకోగా 37,447 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ.4కోట్ల 9లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉన్నారని వీరికి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.