Politics

బీజేపీ దగ్గర విషం తప్ప..విషయం లేదు – TNI రాజకీయ వార్తలు

బీజేపీ దగ్గర విషం తప్ప..విషయం లేదు   – TNI  రాజకీయ వార్తలు

* రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. విభజన చట్టం హామీల ఊసే లేదు. 18 రాష్ట్రాల సీఎంలు వచ్చారు.తెలంగాణ కంటే ఎక్కువ ఏం చేశారో చెబుతారనుకున్నాం. బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు అని మరోసారి రుజువైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మట్లాడారు.అమిత్ షా నీళ్లు, నిధులు, నియామకాల గురించి మాట్లాడారు . నీళ్లు, నిధులు నియామకాలు వచ్చాయని ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఏ జిల్లాకు అయినా వెళదాం పదండి. నీళ్లు ఎలా వచ్చాయో తెలుస్తుంది. నాతో పాటు వస్తే నీళ్లు ఎలా వచ్చాయోచూపిస్తానని అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు.నీళ్లు రాక పోతే ప్రధాని మోదీ లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొన్నామంటారు? పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెక్కలు చెప్పిన విషయాన్ని మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు. 2కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యం నీళ్లు రాక పోతే ఎలా పండుతుందని సూటిగా ప్రశ్నించారు.

*ప్రజల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని BJP చూస్తోంది: Srinivasa Rao
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని చూస్తోందని ఆరోపించారు. ఇది తెలంగాణ కాదని, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చిన మోదీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలతోపాటు ఏ ఒక్క హామీ ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో మోదీ రాష్ట్రంలోకి అడుగు పెట్టే పరిస్థితి ఉండదన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన సందర్భంగా వైసీపీ, టీడీపీలు ప్రత్యేక హోదాపై తమ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీలానే వైసీపీ టీడీపీలు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడుతామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

*అల్లూరి జయంతికి ప్రధాని రావడం గర్వకారణం: రఘురామ
అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని మోదీ రావడం గర్వకారణమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని వస్తున్నారని కార్యక్రమానికి హాజరవుదామనుకున్నానని, అయితే తనను సభకు వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. విషనాగులే పాలకులవుతారని, ఆనాడు అంబేద్కర్ అనుకోలేదని రఘురామ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులుంటాయని తెలిస్తే రాజ్యాంగాన్ని మరోలా రాసేవారని తెలిపారు. ఇలాంటి నాయకులు ఏపీని పాలిస్తుండడం దురదృష్టకరమన్నారు. పర్యటన లిస్టులో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ముందే ప్రొటోకాల్ అంశాలపై లేఖ రాశానని, తన పేరును లిస్టులో ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదన్నారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోకపోతే ఏమనాలి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

*నా హత్యకు కుట్ర: MP Raghurama
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటివద్ద ఉధృక్తత ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముందు ఓ వ్యక్తి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి పోటోలు తీస్తున్నట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తాను ఏపీ పోలీసునంటూ ఆ వ్యక్తి చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐడీ కార్డు చూపమంటే.. సిబ్బందితో ఆ వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. కాగా తన హత్యకు కుట్రపన్నారని రఘురామ ఆరోపించారు. అందుకే రెక్కీ నిర్వహించారని మండిపడ్డారు.

*YCP సర్కార్ది అరాచక పాలన: చినరాజప్ప
వైసీపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ది అరాచక పాలన అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ ద్వారా అరాచక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని గంజాయి కేసులతో వేధిస్తున్నారని తప్పుబట్టారు. తప్పుడు కేసులు అడ్డుకున్నందుకు మాజీ మేయర్ హేమలతపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని చినరాజప్ప తెలిపారు.

*భీమవరం సభలో మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి: Ramakrishna
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరానికి వస్తున్న సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. భీమవరం సభలో మోదీ ఏపీ (AP)కి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలను నెరవేర్చాలన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి తగు నిధులు కేటాయించాలని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కేంద్రీయ విద్యాసంస్థలకు తగు నిధులు మంజూరు చేయాలని తెలిపారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సత్వరమే నిధులు కేటాయించి, త్వరితగతిన పూర్తి చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

*KCRకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు: Bandi Sanjay
తెలంగాణ సమాజానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పారని, సీఎం కేసీఆర్‌ కు చెప్పాల్సిన అవసరం తమకు లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముందు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రజల వద్ద మొహం చెల్లక సీఎం కేసీఆర్ పారిపోతున్నారని విమర్శించారు. మోదీని ఎదుర్కోవడానికి ఫ్లెక్సీల కోసం ఖర్చుపెట్టిన డబ్బులు పెద ప్రజల కోసం ఖర్చు పెట్టాలన్నారు. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. కేసీఆర్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతమయిందన్నారు. ముఖ్యమంత్రి తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ అని, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని బండి సంజయ్ అన్నారు

*అల్లూరి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం: Kishan reddy
అల్లూరి సీతారామారాజు ప్రకటించారు. అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరంలోని పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ… స్వాతంత్య్రం కోసం అనేక మంది పోరాటం చేశారని… వారి చరిత్ర నేటి తరానికి తెలియాలన్నారు. అల్లూరి సంచరించిన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుల కుటుంబాలను కలుస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

*తెలంగాణ పశ్చిమబెంగాల్లో అధికారంలోకి వస్తాం:అమిత్ షా
ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని భాజపా అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా విమర్శించారు.నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొవిడ్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌, రాహుల్‌ను ఈడీ ప్రశ్నించడం.. ఇలా ప్రతి అంశంపైనా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారన్నారు. అవకాశవాద, అవినీతి రాజకీయాలకు కాంగ్రెస్‌ వేదికగా మారిందని విమర్శించారు. పశ్చిమబెంగాల్‌, తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు..

*కార్యకర్తలకు బిల్లులు వస్తాయి : మంత్రి అంబటి
‘‘ఈ ప్రభుత్వంలో కార్యకర్తలు చేసిన పనులకు బిల్లులు రేపు కాకుంటే ఎల్లుండి వస్తాయి… ఎక్కడికి పోతాయి.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆదివారం జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీలో మంత్రి ఈ హామీ ఇచ్చారు.

*మోదీకి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు – పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు మోదీ పంగనామాలు పెట్టారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహా అభివృద్ధి ప్యాకేజీ చట్టప్రకారం ఇవ్వాల్సి ఉండగా మొండిచేయి చూపారని మండిపడ్డారు. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం ఓడరేవు తదితర అంశాల కింద దాదాపు రూ.5లక్షల కోట్లు ఆర్థికసాయం చేయాల్సి ఉండగా ఎనిమిదేళ్లలో కేవలం రూ.20వేల కోట్లు విదిలించి అన్యాయం చేశాడన్నారు. అల్లూరి విగ్రహావిష్కరణ చేసే నైతిక హక్కు మోదీకి లేదని, అలాచేస్తే అల్లూరి ఆత్మతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు క్షోభిస్తాయని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

*డిమాండ్లు నెరవేర్చకపోతే వైసీపీని గద్దె దించుతాం – సెప్టెంబర్‌ 25న ‘దళిత సింహగర్జన’ : హర్షకుమార్‌
‘ఎనిమిదేళ్లుగా దళితులు ఫిర్యాదు చేసిన అట్రాసిటీ కేసుల్లో ఎంతవరకు బాధితులకు న్యాయం జరిగిందో చెప్పాలి. దీనిపై హైకోర్టు జడ్జి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల నుంచి తీసుకున్న అసైన్డ్‌ భూములకు సంబంధించి వారికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద డబ్బులు చెల్లించాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్న వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఈ మూడు అంశాలపై సెప్టెంబరు 25వ తేదీలోగా ప్రభుత్వం స్పందించాలని లేకపోతే, రాజమహేంద్రవరం వేదికగా పది లక్షల మందితో ‘దళిత సింహగర్జన’ నిర్వహించి తమ సత్తా చాటుతామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ హెచ్చరించారు. దళిత డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతామన్నారు. దళితుల సింహగర్జన పేరుతో విశాఖలోని ఓ హోటల్‌లో మేధావులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాపులు, దళితుల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే కోనసీమ జిల్లా పేరు విషయంలో ప్రభుత్వం రగడ సృష్టించిందని ఆరోపించారు. కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసును సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని హర్షకుమార్‌ కోరారు.

*ముద్దుల మామయ్య విదేశాల్లో తిరుగుతున్నాడు: పవన్
రూ. లక్ష కట్టించుకుని టిడ్కో ఇళ్లు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. ముద్దుల మామయ్య విదేశాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కట్టడం లేదన్నారు. విదేశీ విద్యకు కూడా జగన్‌ సర్కార్‌ డబ్బులివ్వడం లేదని ఆరోపించారు. రోజా తనను తిట్టడం కాదు.. ప్రజలు సమస్యలు చూడాలని సూచించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పిడుగురాళ్లలో భూసేకరణ చేసి ఏళ్లు గడిచినా పరిశ్రమ రాలేదన్నారు. పరిశ్రమపై ఎవరైనా అడిగితే ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఎందుకు వణికిపోతుందో నాకే అర్థం కావడం లేదు: రఘురామ
రేపు అల్లూరి జయంతి వేడుకలకు హాజరవుతానని ఎంపీ రఘురామ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వం నేనంటే ఎందుకు వణికిపోతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే నాకు వీవీఐపీ పాస్ ఇవ్వాలి.. కానీ ఇవ్వలేదన్నారు. ఎవరు చెప్పారని వీవీఐపీ పాస్ ఇవ్వట్లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఎస్పీజీ రవిప్రకాష్ తన నెంబర్ బ్లాక్ చేశారని మండిపడ్డారు. ధైర్యముంటే నన్ను ఆపుకోండి.. చూద్దామని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఓ వింత వ్యాధితో బాధపడుతోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. నాకెలాంటి అవమానం జరిగినా.. అది ప్రధానికి జరిగినట్టేనన్నారు. అవమాన పరిణామాలు జులై 18 తర్వాత తీవ్రంగా ఉంటాయాన్నారు. తన ఫ్లెక్సీలను కట్టినవాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందని, పులి కడుపున పిల్లి పుట్టిందన్నారు.

*వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని CID వేధించింది: Chandrababu
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ వేధింపులపై ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను.. సీఐడీ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించారని మండిపడ్డారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఇంట్లోకి చొరబడి వాళ్ల కుటుంబీకులను భయబ్రాంతులకు గురిచేశారని, స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడడం దారుణమన్నారు.విచారణ సమయంలో గదిలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ అధికారులు వ్యవహరించారన్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందన్నారు. టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ శ్రేణులను అక్రమంగా అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీకి ఏముందని? ప్రశ్నించారు. కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు డీజీపీ అండగా నిలబడాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

*కేసీఆర్‌ మీ ఆరోగ్యం జాగ్రత్త: అర్వింద్‌
‘బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, నేతలను చూసి సీఎం కేసీఆర్‌, తనయుడు కేటీఆర్‌ పూనకం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ మీ ఆరోగ్యం జాగ్రత్త’ అని ఎంపీ అర్వింద్‌ ఎద్దేవా చేశారు. విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీజేపీని ప్రశ్నించడం కాదు. ముందు మా ప్రశ్నలకు జవాబు చెప్పండి అని కోరారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా సరఫరా జరుగుతోందని, హిందూ మహిళలపై దాడులు, బలత్కారాలు జరుగుతున్నాయన్నారు.

*కేసీఆర్‌ను చూడడానికి జనం ఇష్టపడట్లేదు: ఈటల
కేసీఆర్‌ ముఖాన్ని చూడడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడడం లేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. అయినప్పటికీ రూ.33 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టి ముఖాన్ని చూపించేందుకు కేసీఆర్‌ తాపత్రయపడ్డారని విమర్శించారు. ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపించకపోయినా ప్రజల గుండెల్లో మోదీ స్థానం సంపాదించుకున్నారన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాబోతున్న 20వ రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ లాంటి బుడ్డ పార్టీ.. బీజేపీకి పోటీ కాదని ఈటల అన్నారు.

*గడీల రాజ్యాన్ని బద్దలు కొడతాం: కె.లక్ష్మణ్‌
తెలంగాణలో కేసీఆర్‌ స్థాపించిన గడీల రాజ్యాన్ని బద్దలు కొడతామని, కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో బందీ అయిన తెలంగాణ తల్లిని రక్షిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, ఎంఐఎం తోడు దొంగలన్నారు టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్‌ తరహా పరిపాలన అందిస్తామని, యూపీ నుంచి బుల్డోజర్‌ తెలంగాణకు రాబోతున్నదని లక్ష్మణ్‌ అన్నారు.