ఏటా జరుపుకునే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలు కోవిడ్ కారణంగా ఈ సారి రెండేండ్ల విరామం తర్వాత జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరవంగ వైభవంగా 17వ ఆటా మహాసభలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్‌ఐ కుటుంబాలకు చెందిన 15వేల మంది ఒకే చోట కలిసి మూడు రోజులపాటు పండుగ చేసుకున్నారు.ఈ వేడుకలకు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, రవీంద్రకుమార్, టిఎస్ఐఐసి చైర్మన్ గాదరి బాలమల్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. దీంతో ఆ వేదిక మొత్తం పండుగ వాతావరణాన‌్ని సంతరించుకుంది.
పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవల్లరులు జరిగాయి. ఎన్ఆర్ఐ కుటుంబాలకు చెందిన సభ్యులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు భాషా, సంస్కృతి పరిరక్షణ, ఎన్ఆర్ఐల అభివృద్ధి, వారి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాల మీద చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులు పాల్గొన్నారు. వారిందరినీ ఆటా ప్రతినిధులు సత్కరించారు.
మొదటి రోజు ప్రఖ్యాత ఇండియన్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లు, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ హాజరయ్యారు. రెండో రోజు తెలంగాణ పెవిలియన్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. చివరిదైన మూడో రోజున కూడా పలు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ గవర్నర్ హాజరయ్యారు. మ్యూజిక్ లెజండ్ ఇళయరాజా, సంగీత దర్శకుడు తమన్, పర్యావరణ వేత్త జగ్గీ వాసుదేవ్ తదితరులు హాజరయ్యారు.
మూడు రోజుల ఆటా కార్యక్రమాలను వేదిక మీద సింగర్ సునీత సమన్వయం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ఆటా ప్రతినిధులు ప్రెసిడెంట్ భువనేశ్ భుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, అనిల్ బోయినపల్లి తదితరులు పంచుకున్నారు. టీఆర్ఎస్-ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవితతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.