కాలక్షేపానికి కొన్ని, కడుపు నింపుకోవడానికి కొన్ని, నంజుకోవడానికి కొన్ని, జుర్రుకోవడానికి కొన్ని, దావత్‌లకు కొన్ని, దర్జాలకు కొన్ని.. తెలంగాణ ఓ వంటకాల టంకశాల. మన మహిళలు కనిపెట్టని రుచులు లేవు. వండిపెట్టని భోజనాలు లేవు. పని ఒత్తిడిలో పడిపోయి మనం ఆ కమ్మదనాన్ని రేపటి తరానికి పరిచయం చేయలేకపోవడం వల్లే.. పిజ్జా బర్గర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఒక్కసారి పక్కా లోకల్ రుచులను కొసరి కొసరి వడ్డించి చూడండి.. వదిలిపెడితే ఒట్టు! ఫార్మసిస్ట్ ఇందిర ఐరేని యూట్యూబ్ చెఫ్‌గా అవతరించడం వెనుక ఉన్న లక్ష్యమూ అదే.
ఇందిర ఐరేని స్వస్థలం సిద్దిపేట. తల్లిదండ్రులు కళావతి, వెంకట్రాములు. భర్త అనిల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇద్దరు పిల్లలు. అమ్మాయి జర్మనీలో మెడిసిన్ చేస్తున్నది. అబ్బాయి ఇక్కడే చదువుతున్నాడు. ఇందిర డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నది. తీరిక సమయంలో వంటింటిని ప్రయోగశాలగా మార్చేది. పాత రుచులపట్ల మమకారంతో అమ్మ, అమ్మమ్మల నుంచి సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకునేది. ఓసారి, సరదాగా స్పైసీ హైదరాబాద్ బిర్యానీ వండి, రెసిపీని వివరిస్తూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. దీనికి మంచి స్పందన వచ్చింది. లైకులు వెల్లువెత్తాయి. మరిన్ని రుచులు పరిచయం చేయమంటూ నెటిజన్ల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో, ‘హైదరాబాదీ రుచులు’ పేరిట యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ఓ చానల్‌ను ఏర్పాటుచేసింది. ఆ వేదిక మీద గత ఏడేండ్లుగా వారానికి మూడు వంటకాలను పరిచయం చేస్తూ.. యూ ట్యూబ్ స్టార్ చెఫ్‌గా పేరు తెచ్చుకున్నది.
పన్నెండు వందలకుపైగా..
ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో కొత్త వీడియోలను అప్‌లోడ్ చేస్తూ భోజనప్రియుల అభిమానాన్ని పొందుతున్నది ఇందిర. ఇప్పటికే హైదరాబాదీ దమ్ బిర్యానీ, స్పైసీ ఎగ్ కర్రీ, చేపల పులుసు, బగారా చికెన్ రైస్, తలకాయ కూర.. ఇలా ఎన్నో వంటకాలను పరిచయం చేసింది. పచ్చళ్లు, స్నాక్స్, స్వీట్లు, కారంపొడులు, పండుగల స్పెషల్ వంటకాల రెసిపీలనూ అందించింది. రాగి జావ, అంబలి, సర్వపిండి గొప్పదనాన్నీ వీక్షకులకు ఇ-రుచి చూపింది. అలా అని, ఒక్క తెలంగాణ వంటకాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ భోజనాలూ వడ్డించింది. ఇప్పటికే దాదాపు పన్నెండు వందల రెసిపీలను అప్‌లోడ్ చేసింది. ఎన్ని వంటలు వండినా, తనకు మాత్రం ఎగ్‌కర్రీ అంటేనే ఇష్టమని చెబుతుంది ఇందిర. తరచూ గృహిణులకు కిచెన్ టిప్స్ కూడా అందిస్తుంది. పాకశాస్త్ర గురువు హోదాలో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలూ ఇస్తుంది. పలు పత్రికలకు కిచెన్ సైన్స్ కాలమిస్ట్ కూడా.
రుచుల సందేశం
ఇందిర చానల్‌కు యూట్యూబ్‌లో 7.89 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 4.86 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. నెస్లీ, ఎంటీఆర్, ఈస్ట్రన్ మసాలా, కెంట్, స్పెన్సర్స్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, హిమాలయ, ఫార్చ్యూన్ ఫ్రెష్ ఆటా, కంట్రీ చికెన్ తదితర కంపెనీల ఉత్పత్తులకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నది. భారత పర్యటనకు విచ్చేసిన దాదాపు 500 మంది విదేశీ ప్రతినిధులకు తన వంటకాలను రుచి చూపింది ఇందిర. తెలంగాణ టూరిజం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అవార్డును కూడా అందుకున్నది. ‘రెస్టారెంట్లలో ఎన్నో వంటకాలను రుచి చూస్తుంటాం. కానీ చాలామందికి వాటిని ఎలా తయారు చేయాలో తెలియదు. తినాలనిపించిన ప్రతిసారీ రెస్టారెంట్‌కు వెళ్లడమంటే.. ఖరీదైన వ్యవహారమే. ఆ ఇబ్బంది లేకుండా, మధ్యతరగతి కుటుంబాలకు రెస్టారెంట్‌ను మరిపించే రెసిపీలను పరిచయం చేస్తున్నా. మరీ ముఖ్యంగా, అసలైన హైదరాబాదీ రుచులను ప్రతి వంటగదికీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఓ చానల్ ఏర్పాటుచేశాను. నా ప్రయత్నానికి నెటిజన్ల నుంచి ఎంతో ప్రోత్సాహం లభిస్తున్నది. ఇన్నేండ్లుగా, ఇన్ని వీడియోలు అప్‌లోడ్ చేశానంటే.. నా భర్త అనిల్, ఇతర కుటుంబసభ్యుల సహకారమే కారణం. విదేశీయులు సైతం తెలంగాణ వంటకాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. సందేహాలుంటే నన్ను సంప్రదిస్తున్నారు’ అంటారు ఇందిర.