ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు ప్రధాన (సంఖ్యాబలం పరంగా) కులాలతో ముడిపడ్డాయి. ఈ రాష్ట్రంలో కూడా తమకు అస్తిత్వాన్ని కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీ మూడో కులాన్ని ఎంచుకుంది! తామేమీ భిన్నమైన పార్టీ కాదని, కులరాజకీయాల తానులోనే తాము కూడా ఒక ముక్క మాత్రమేనని ఏపీ ప్రజలకు చాన్నాళ్ల కిందటే చాటిచెప్పింది!ఇప్పుడున్న పార్టీ అధ్యక్షుడు, అంతకుపూర్వం ఉన్న అధ్యక్షుడు అందరూ ఆ కోవకు చెందిన వారే. పవన్ కల్యాణ్ తో జట్టు కట్టి.. నెత్తిన పెట్టుకోవడం కూడా.. ఆ కులం ఓట్లన్నీ గంపగుత్తగా తాము దండుకోగలమేమో అనే ఆశతోనే అనే విమర్శలూ బాగా వినవచ్చాయి. తాజాగా సీన్ మారింది. రాజకీయాలను కులాలు అమితంగా ప్రభావితం చేసే అంశాలే అయినప్పటికీ.. జగన్ మోహన్ రెడ్డి పాలనను తుదముట్టించడం అనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో జట్టు కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో.. మోడీ ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని భీమవరం కార్యక్రమానికి పిలిచి.. అగ్రతాంబూలం ఇవ్వడం గమనించాల్సిన సంగతి.పవన్ తెలుగుదేశం వైపు మళ్లడం ద్వారా.. తన కులానికి ఒక సంకేతం ఇస్తే.. దానికి కౌంటర్ గా ఆ కులం ఓట్లు జగన్ ప్రభుత్వం కూలడానికి దారి తీయకుండా.. మోడీ దళం ఈ ఎత్తుగడ వేసిందా అనిపిస్తోంది. చిరంజీవిని తమ సరసన ఉంచుకుని, లేదా, ఆయనతో సయోధ్యను ప్రదర్శించుకుని ఆ కులం ఓట్లను చీలిస్తే.. అంతిమంగా తమకు ఎప్పటికీ విధేయంగా మాత్రమే ఉండగల.. జగన్ కు మేలు చేయాలని మోడీ అండ్ కో దీర్ఘకాలిక వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తోంది.
జగన్ పీఠం దిగకుండా చూడడానికి మోడీ ఇలాంటి ఎత్తుగడలు ఎన్నయినా వేయవచ్చు గాక.. కానీ.. రాజకీయాల్లోకి దిగి చేతులు కాదు కదా ఒళ్లంతా కాల్చుకుని.. ఆ రొంపిలోని బురదను అంటించుకున్న చిరంజీవి బుద్ధి తెచ్చుకుని.. ఇక సినిమాలు తప్ప ఇంకోటి చేయను అని ఎన్నడో ప్రకటించారు? ఇప్పుడు మోడీ- జగన్ కులరాజకీయాల ఎత్తుగడలలో ఆయన తాను పావుగా మారడం ఎందుకు? కావలిస్తే.. ఈసారి తన సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వచ్చి జగన్ ను కలిసి వెళ్లిపోతే చాలు కదా!? -దాసరి కృష్ణ మోహన్ సీనియర్ జర్నలిస్ట్