NRI-NRT

బోరిస్​ జాన్సన్​కు షాక్.. రిషి సునాక్ రాజీనామా.. మరో మంత్రి కూడా..

బోరిస్​ జాన్సన్​కు షాక్.. రిషి సునాక్ రాజీనామా.. మరో మంత్రి కూడా..

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స‌ర్కార్ రాజ‌కీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య‌శాఖ మంత్రి సాజిద్ జావిద్ మంగ‌ళ‌వారం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డం బాధాక‌రమని రిషి సునాక్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొన‌సాగ‌డం క‌ష్టసాధ్యం అని తెలిపారు. ప్రధాని పదవి నుంచి బోరిస్‌ జాన్సన్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

వరుసగా పలు వివాదాల్లో చిక్కుకుంటున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు మంగళవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయామని చెబుతూ కేబినెట్‌లోని ఇద్దరు సీనియర్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఒకరు భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునాక్‌(42) కాగా మరొకరు ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌. రిషి సునాక్‌ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి అల్లుడు. అంతకుముందు రోజంతా పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. దుష్ప్రవర్తన ఆరోపణలతో ఇటీవల ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌ పదవి నుంచి సస్పెండ్‌ అయిన పార్లమెంటు సభ్యుడు క్రిస్‌ పించర్‌ తాజా వివాదానికి కేంద్ర బిందువు.

2019లో ప్రధాని జాన్సన్‌… క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్‌ పట్టించుకోకుండా క్రిస్‌ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్‌ పించర్‌ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తెలపడం.. పించర్‌ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించడంతో వివాదం కీలక మలుపు తిరిగింది.దీంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు క్షమాపణలు కోరారు. కరోనా సమయంలో అధికార నివాసంలో మద్యం విందులో పాల్గొన్నందుకు గాను ఇప్పటికే దేశ ప్రజలకు జాన్సన్‌ క్షమాపణలు చెప్పారు. ఇలా వరుసగా పలు వివాదాల్లో చిక్కుకోవడం, తన దృష్టికి ఆయా విషయాలు వచ్చినా రాలేదని చెప్పడం, ఆ తర్వాత విచారం వ్యక్తం చేయడం జాన్సన్‌కు పరిపాటిగా మారిన నేపథ్యంలో మంత్రిమండలిలోని ఇద్దరు సీనియర్లు ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయినట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ తొలుత రాజీనామా చేయగా ఆ తర్వాత రిషి సునాక్‌ కూడా ఆర్థిక మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. ప్రధాని పదవి నుంచి బోరిస్‌ జాన్సన్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

కొత్త మంత్రులను నియమించిన ప్రధాని..
బ్రిటన్​ ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు రాజీనామా చేసిన వెంటనే ఆ దేశ ప్రధానమంత్రి బోరిన్​ జాన్సన్ కొత్త మంత్రులను నియమించారు. యూకే క్యాబినెట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవ్ బార్క్లే.. ఆరోగ్య శాఖ మంత్రిగా, విద్యా కార్యదర్శి నదీమ్ జహావి ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.