Devotional

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే క‌లిగే లాభాలేంటి?

Auto Draft

ఆషాఢం వచ్చింది. అతివల అరచేతులు గోరింటాకు రంగులతో తడిసి ముద్దవుతాయి. ఇంతకు ముందంటే చందమామను, చుక్కలను పోలిన ఒకటిరెండు డిజైన్లే. మెహిందీ కోన్‌లు వచ్చాక అందమంతా అరచేతిలోనే ఇమిడిపోయేన్ని మోడళ్లు. తీగలు, పూల డిజైన్లను వేళ్ల కొనల నుంచి మోచేతి దాకా పెట్టుకుంటారంతా. కానీ ఇప్పుడు, వేళ్ల నిండా డిజైన్లు గీసి వాటన్నిటినీ కలుపుతూ మెహిందీ ఆర్ట్‌ను ముగిస్తున్నారు. అంటే అరచేతికి అంటకుండా చుట్టూ గోరింట ముగ్గులేస్తున్నారన్నమాట. ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలను సృష్టించే మెహిందీ ఆర్టిస్టులు ఈ ఏడాది పరిచయంచేసిన సరికొత్త ట్రెండ్‌ ఇది. చుట్టూ ఎరుపు రంగు డిజైన్ల మధ్య అరచేయి తెల్లగా కనిపించేలా.. చేతి అందాన్ని మరింత ఇనుమడిస్తున్నది. నేరుగా గోరింటాకుతోనూ ఇలాంటి డిజైన్లు ప్రయత్నించవచ్చు.

ఆరోగ్యానికి..
తొలకరి వేళ ఇంటా బయటా చిత్తడి. చినుకుల్లో నానడం వల్ల వచ్చే రకరకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న గోరింటాకు. ఒంటి వేడిని అదుపుచేస్తూ జ్వరాల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. శరీరాన్ని చల్లబరిచే ప్రత్యేక గుణాలతో.. నరాలకు సాంత్వన చేకూర్చి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దీనిలోని కూమరిన్‌, గ్లాంథోన్‌, గ్లైకోసైడ్‌లాంటి సేంద్రియ, రసాయనిక మిశ్రమాలతో పాటు అరచేతికి ఎరుపు రంగునిచ్చే లాసన్‌ అనే పదార్థం కూడా గాయాల్ని నయం చేస్తుంది. చర్మ సమస్యలకు మందులానూ పనిచేస్తుంది.