Movies

హ్యాపీని నాకోసం రాయడం నా లక్‌

హ్యాపీని నాకోసం రాయడం నా లక్‌

‘‘నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’లో మిథున పాత్ర చేసినప్పుడు నటన నాకు కొత్త. కష్టపడి నా బెస్ట్‌ ఇచ్చాను. ఆ తర్వాత పాత్రలన్నీ కేక్‌ వాక్‌లానే చేశాను. ఇప్పుడు ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమాలో కొత్తగా ఉన్న హ్యాపీ పాత్ర చేయడం చాలా కొత్తగా అనిపించింది’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా దర్శకత్వంలో లావణ్యా త్రిపాఠి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజవుతోంది. ఈ సందర్భంగా లావణ్యా త్రిపాఠి చెప్పిన విశేషాలు.

ఒక ఇంటర్వ్యూలో నన్ను చూసిన రితేష్‌ రానా హ్యాపీ పాత్రని నా కోసం రాయడం నా అదృష్టం. ‘హ్యాపీ బర్త్‌డే’ జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా ఉంటాయి. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్‌ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్‌పై యాక్షన్‌ చూపించే అవకాశం ఈ సినిమాతో దక్కడం హ్యాపీ. నిజజీవితంలో సరదాగా ఉంటాను.. కాబట్టి ఈ మూవీలో కామెడీ చేయడం కష్టమనిపించలేదు. అయితే 9 కిలోల బరువు ఉండే గన్స్‌ పట్టుకుని షూటింగ్‌ చేయడం కష్టం అనిపించింది. ఇది ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమా కాదు. క్యారెక్టర్‌ బేస్డ్‌ కథ. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఉన్నత విలువలతో తీర్చిదిద్దారు.

నేను చాలా కథలు వింటాను. కానీ, చేసిన పాత్రలే చేయడం నాకు నచ్చదు. నేను సినిమాలు తగ్గించినట్లు అనిపించడానికి కారణం ఇదే. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.. అదే గొప్ప ఆనందం. అందరూ నంబర్‌ వన్‌కి వెళ్లాలని లేదు కదా? నా వర్క్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను.. నా ప్రయాణం సంతృప్తిగా ఉంది. ∙ఇలాంటి పాత్రలే చేయాలని నేను ఆలోచించను. నా మనసుకు నచ్చినవి చేస్తాను. అయితే నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం తమిళ్‌లో అథర్వతో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో ఆది సాయికుమార్‌తో ‘పులి–మేక’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాను.