శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. పవిత్రోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బుధవారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.పవిత్రోత్సవాల కోసం జులై 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జులై 10న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు.జులై 11న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు. జులై 12న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, సూపరింటెండెంట్లు భూపతి, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డిశేఖర్, వేదపారాయణదారులు పాల్గొన్నారు.