ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ అనుభవించనంత వైభవాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు మహారాణి క్వీన్ ఎలిజబెత్. ఎంతలా అంటే.. బ్రిటన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. రాజకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. రాజకుటుంబం తరపున తప్పనిసరిగా ఆమె హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ఇక నుంచి ఆమె దూరంగా ఉండనున్నారు. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా… వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ… తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు కూడా.