NRI-NRT

అగ్రరాజ్యంలో వదలని తుపాకీ నీడ

అగ్రరాజ్యంలో  వదలని తుపాకీ నీడ

అమెరికాలో షికాగో సమీపంలో జరుగుతున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల పరేడ్ మీద ఓ దుండగుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటన విషాదకరమైనది. ఈ దాడిలో పిల్లలతో సహా ముప్పైమందికి పైగా గాయపడ్డారు. ఓ రిటైల్ స్టోర్ మీదనుంచి ఆ ఉన్మాది బుల్లెట్లు కురిపించడంతో అక్కడున్నవారికి క్షణంపాటు ఏం జరుగుతున్నదో అర్థంకాలేదు. మొదట అవి బాణాసంచా శబ్దాలని భ్రమపడి, ఆ తరువాత తేరుకొని పరుగులు తీసేలోగా కొందరు బలి అయిపోయారు. పరేడ్‌లో పాల్గొన్నవారూ, చుట్టూచేరి లయబద్ధమైన ఆ బ్యాండ్‌ను ఆనందిస్తున్నవారూ అరుపులూ కేకలతో చెల్లాచెదురైపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఆనందాన్ని పంచాల్సిన ఆ వీడియోల్లో రక్తపుమరకలు దర్శనమిస్తున్నాయి, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

ఈ సంఘటనకు బాధ్యుడిగా ఇరవైరెండేళ్ళ రాబర్ట్ క్రిమోను పోలీసులు అనుమానించి అరెస్టు చేశారు. ఇటువంటి దాడులూ విధ్వంసాలతో మన స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనమే అవమానించుకోవడమేమిటని కొందరు వాపోతున్నారు. తుపాకీ హింసకు వ్యతిరేకంగా మరింత పోరాడతాననీ, వెనక్కుతగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోమారు ప్రతినబూనారు. ఉన్మాది స్థానికుడేనని, ఎంతోకాలంగా అక్కడ ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన వాడేనని అంటున్నారు. ఈ ఇరవైరెండేళ్ళ కుర్రాడు తన యూట్యూబ్ చానెల్లో ఇటీవల స్కూళ్ళతో సహా జరిగిన వివిధ విచ్చలవిడి కాల్పుల వీడియోలు కొన్ని పోస్టుచేసినందున ఈ తరహా హత్యాకాండకు అతడు ఎప్పటినించో మానసికంగా సంసిద్ధుడైవుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పిల్లలు, వృద్ధులు ఒకచోట చేరి ఆనందిస్తున్న ఈ అందమైన, విశేషమైన కార్యక్రమాన్ని అతగాడు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడో ఇంకా తెలియదు కానీ, అతడు రక్తపాతాన్నీ, హింసను ఆరాధిస్తున్నట్టు మాత్రం అర్థమవుతున్నది. ఓ మారణాయుధాన్ని చేతబూని ఎదుటివారి శరీరాలను విచ్చలవిడిగా తూట్లుపొడిచే ఈ రకం ఉన్మాద ఘటనలు అమెరికాలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మిగతా సమాజం మీద అర్థంకాని ఆగ్రహం, తమలో పేరుకుపోయిన నిరాశానిస్పృహలు ఈ దుశ్చర్యలకు కారణమవుతున్నాయి. కొందరు తమ చేతగానితనానికి సమాజాన్ని శిక్షించాలనుకుంటారు. ఇటువంటివి కొనసాగుతూంటే, సామూహిక వేడుకలు జరుపుకొనే సందర్భాలు కూడా తగ్గిపోతాయి. ఇల్లుదాటి బయటకు రావడానికీ, హాయిగా కుటుంబమంతా కలిసి కళ్ళారా వేడుకలను చూసి ఆనందించడానికి భయం అడ్డుపడుతుంది.

ఇంకా సగం మాత్రమే పూర్తయిన ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అమెరికాలో జరిగిన ఈ రకం మూకుమ్మడి హత్యాకాండల సంఖ్య మూడువందలకు పైమాటే. అమెరికన్లకు తుపాకీ ధరించే, బహిరంగంగా తీసుకెళ్ళే హక్కు ఉన్నదని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పుచెప్పి, మనుషుల ప్రాణాలకంటే తుపాకులకే ఎక్కువ విలువ ఇచ్చింది. ప్రభుత్వాలకు ఎంత పెద్ద బలగం ఉన్నా, ప్రజలందరికీ భద్రత కల్పించడం, సామూహిక వేడుకలు జరిగే ప్రతీ ప్రాంతాన్నీ శోధించడం, స్కూళ్ళు కాలేజీలు కార్యాలయాలు ఇత్యాదివన్నింటికీ రక్షణనివ్వడం అసాధ్యమైన పని. దానికి బదులుగా అందరి చేతుల్లోంచి తుపాకులు లాక్కోవడమే ఉత్తమం. మారణాయుధాలు స్వేచ్ఛగా లభించడం, మరొకరి ప్రాణం సులువుగా తీయడం హక్కు కాబోదు. జీవించే హక్కు అందరికీ సమానమే. వందలాదిమంది చావులకు కారణమవుతున్న అంశంలో కూడా అమెరికన్లు, వారి నేతలు, అక్కడి వ్యవస్థలు సంఘటితం కాలేకపోవడం విషాదం. స్వేచ్ఛను అమితంగా ప్రేమించే అమెరికన్లు చివరకు స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా రక్తాన్ని కళ్ళచూడవలసి వచ్చింది.

ఇటువంటి ఘటనలు జరిగినప్పుడల్లా బహిరంగస్థలాలన్నింటినీ బందుపెట్టి, ఇళ్ళలో దాక్కోవలసి రావడం భద్రత అనిపించుకోదు. తమకు నచ్చినచోటుకు ఏ భయమూ లేకుండా పోవడం, ఆనందంగా గడపడమే నిజమైన స్వాతంత్ర్యం తప్ప, మారణాయుధాలు చేబూనడం కాదు. మూడుదశాబ్దాల తరువాత తుపాకుల నియంత్రణకు జో బైడెన్ ఒక నిర్దిష్టమైన చట్టాన్ని తెచ్చినందుకు మెచ్చవలసిందే. కానీ, ఆయుధాల వినియోగానికి అడ్డుకట్టవేసేందుకు చేయాల్సింది ఇంకా ఉందని స్వాతంత్ర్య దినోత్సవ వేళ జరిగిన ఈ మారణకాండ తెలియచెబుతున్నది. సంఘటన స్థలంలో అందరి కాళ్ళకిందా నలిగిన అమెరికా జెండాలతో పాటు, అక్కడి రక్తపు మరకలు, పగిలిన వస్తువులు, విరిగిన పిల్లల ఆటవస్తువులు కూడా పాలకులకు భవిష్యత్ కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాయి.