భారత కుబేరుడు గౌతమ్ అదానీ టెలికాం రంగంవైపు దృష్టిసారించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీగ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్ధరిస్తోందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. 4జీ కంటే 10 రెట్ల వేగంతో డేటా బదిలీకి వీలున్న, వినూత్న సేవలందించేందుకు అనువైన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అధికారికంగా ఈనెల 12న వెల్లడవుతాయి. కనీసం రూ.4.3 లక్షల కోట్ల విలువ కలిగిన 72,097.85 మెగాహెర్ట్జ్ సెక్ట్రం వేలం జులై 26న ప్రారంభమవుతుంది. ఇటీవలే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్‌ఎల్‌డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) లైసెన్సులను అదానీ గ్రూప్ పొందడం గమనార్హం.అంబానీతో నేరుగా పోరు: గుజరాత్‌కే చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీతో, అదే రాష్ట్రీయుడైన గౌతమ్ అదానీ ఇప్పటివరకు ఏ వ్యాపారంలోనూ నేరుగా తలపడిన సందర్భాలు లేవు. అంబానీ చమురు, పెట్రో రసాయనాల వ్యాపారం నుంచి టెలికాం-రిటైల్ రంగాల్లోకి విస్తరించారు. గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్తు పంపిణీ వ్యాపార రంగాల్లో ప్రస్తుతం అదానీ ఉన్నారు. ఇటీవలే పెట్రో రసాయనాల వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అనుబంధ సంస్థను అదానీ ఏర్పాటు చేయగా, ఇప్పుడు టెలికాంలోకి వస్తున్నారు. తద్వారా ఇద్దరు కుబేరుల మధ్య పోటీ తీవ్రం కానుంది. స్వచ్ఛ ఇంధన వ్యాపారంలోనూ ఇద్దరూ పోటీపోటీగా పెట్టుబడులకు సన్నాహాలు చేసుకుంటున్నారు.