బ్రిటన్ ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రిషి సునాక్. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానంలో ‘కన్జర్వేటివ్ పార్టీ’ నేతగా ఎన్నికయ్యేందుకు పలువురు ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో ఉన్న భారతీయ ములాలున్న వ్యక్తుల సంఖ్య రెండుకు పెరిగింది. సుయెలా బ్రవెర్మన్ ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోగా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఆయనకు పలువురు ఎంపీలు మద్దతు ప్రకటించారు. ‘బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా, కన్జర్వేటివ్ పార్టీ నేతగా పోటీ చేస్తున్నాను. దేశ అర్థిక వ్యవస్థను, ప్రధాని పదవి విశ్వసనీయతను పునరుద్ధరిద్దాం. దేశాన్ని ఏకతాటిపై నిలుపుదాం’ అంటూ రిషి ట్వీట్ చేశారు. ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బోరిస్ జాన్సన్ గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తుల్లో ఆయన రెండవ వారు.ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు టామ్ టుగెన్‌దత్, రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్, ఎంపీ స్టీవ్ బేకర్ తదితరులు కూడా ప్రధాని పదవికి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.