Movies

ఆస్ట్రేలియాలో వైర‌ల‌వుతున్న భేల్‌పూరీ.. ఎందుకంటే..

ఆస్ట్రేలియాలో వైర‌ల‌వుతున్న భేల్‌పూరీ.. ఎందుకంటే..

పాశ్చాత్యులకు మన భేల్‌పూరీ రుచి భలేగా నచ్చింది. ఆస్ట్రేలియా మాస్టర్‌ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు ఆదమరచి ఆరగించారు. ఆ కథేమిటో మీరే చదవండి.. మరమరాలు, సేవ్‌, పచ్చి ఉల్లిపాయ, టమాట ముక్కలు, నోరూరించే చాట్‌ మసాలా, ఉప్పు, కారంతోపాటు ఫైనల్‌ టచ్‌గా జోడించే నిమ్మరసం, కొత్తిమీర తురుముతో కూడిన కలర్‌ఫుల్‌ చాట్‌.. భేల్‌పూరీ. చాలా చోట్ల సాయంకాలం కాగానే వీధుల్లో భేల్‌పూరీ బండ్లే కనిపిస్తాయి. అన్నట్టు, మన భేల్‌పూరీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది. ఎందుకంటే ‘మాస్టర్‌ చెఫ్‌ ఆస్ట్రేలియా ’ వంటల పోటీ కార్యక్రమంలో సారా టాడ్‌ ( Sara Todd ) అనే షెఫ్‌ పది నిమిషాల చాలెంజ్‌లో భాగంగా మంటతో పనిలేని మన భేల్‌పూరీని తయారుచేసి జడ్జీలకు వడ్డించింది. ఆ రుచిని చూసి జడ్జీలు తెగ మెచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలను ప్రత్యాశ రథ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా రీట్వీట్లు, కామెంట్లు, లైకులతో వైరలయ్యింది. అంతేకాదు చాలామంది సారాకు ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్నారట. కొందరు నెటిజన్లు ఆస్ట్రేలియాలో ఇండియన్‌ రెస్టారెంట్లు, చాట్‌ సెంటర్ల లొకేషన్లు షేర్‌ చేసి ఓసారి రుచి చూడమని సిఫారసు చేశారు. అదీ మరి మన భేల్‌పూరీ ఘనత. నిజానికి ఇది ఉత్తరాది రుచే అయినా.. దక్షిణాది ప్రజల అభిరుచికీ దగ్గరగా ఉంటుంది.. కారంకారంగా!