ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందచేశారు. శుక్రవారం శ్రీత్యాగరాయ గాన సభలోని కళా దీక్షితులు కళావేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణితశాస్త్రానికే ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీని ఇంటింటికీ తీసుకెళ్లారని కొనియాడారు.అవార్డుల స్థాయి కన్నా ఎత్తుకు ఎదిగిన రామయ్య నుంచి లెక్కలు మాత్రమే కాదు..జీవితం సక్రమంగా నడిచే లెక్కలు కూడా నేర్చుకోవాలన్నారు. త్వరిత గణిత విధానంలో రికార్డు సాధించిన సాయి కిరణ్ సారథ్యంలో ఉన్నత ప్రతిభ చూపిన చంద్రయ్య, నరసింహారావులకు గణిత రత్న అవార్డు బహూకరించారు. బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ అధ్యక్షత వహించారు.