తనపై కొందరు కక్ష పెంచుకొని చేసిన దుష్ప్రచారం వల్లనే ‘ధాకడ్’ చిత్రం పరాజయం పాలైందని బాలీవుడ్ కథానాయిక కంగనారనౌత్ ఆరోపణలు చేసింది. ఆమె కథానాయికగా ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. కంగనారనౌత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు సైతం పేర్కొన్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత దీపక్ ముకుత్ మాట్లాడుతూ.. ధాకడ్’ చిత్రానికి పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగొచ్చిందని తెలిపారు.ఆయన మాటలకు మద్దతుగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ కంగనారనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘నాపై ఉద్దేశ్యపూర్వకంగా చేసిన వ్యతిరేక ప్రచారం వల్లనే ‘ధాకడ్’ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు లభించలేదు. ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఈ సినిమాపై విషప్రచారం జరుగుతున్నది. కొందరు హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలు ఆస్తులు, ఆఫీసులు అమ్ముకున్నారు. అలాంటివేవీ ‘ధాకడ్’ సినిమా విషయంలో జరగలేదు. మా నిర్మాతలు ఫలితం పట్ల సంతృప్తిగా ఉన్నారు’ అని కంగనారనౌత్ పేర్కొంది. అయితే బాక్సాఫీస్ లెక్కలు ప్రకారం దాదాపు 80 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘ధాకడ్’ కేవలం ఐదు కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.