Health

ఆహా.. ఆల్‏బుఖరా..

ఆహా.. ఆల్‏బుఖరా..

ఇది ఆల్‌బుఖరా సీజన్‌… ఈ పండ్లు చూడ్డానికి ఇంపుగా… కొరికితే తియ్యగా… కాస్తంత పుల్లగా… జ్యూసీగా… ‘ఆహా ఏమి రుచిరా’ అనిపిస్తాయి. మన దగ్గర ముదురు ఎరుపు రంగులో లభించే ఆల్‌బుఖరా ఒక్కోచోట ఒక్కో రంగులో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. పోషకాల గనిగా చెప్పుకునే ఆల్‌బుఖరా విశేషాలు వింటే ఎవరైనా ‘ఆహా’ అనాల్సిందే…

ఆపిల్‌కు మీనియేచర్‌లాగా కనిపించే ‘ప్లమ్‌’ జాతి పండు ఆల్‌బుఖరా. సాధారణంగా ఎరుపు-ఊదారంగు మిళితమైన వెరైటీనే మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఆకుపచ్చ, పసుపు, తెలుపు, ఊదా వర్ణాల్లోనూ ఇవి పండుతాయి. ఏ వెరైటీ అయినా వాటిల్లో రాయిలాంటి గింజ ఉంటుంది. అందుకే వీటిని ‘స్టోన్‌ ఫ్రూట్‌’ అని కూడా అంటుంటారు. విదేశాల్లో వీటిని ‘ప్లమ్‌’ అని, అదే ఎండిన (డ్రైడ్‌) ఆల్‌బుఖరాలనైతే… ‘ప్రూన్స్‌’ అంటారు.

రెండో అతి పెద్ద సాగు…
ప్రపంచంలో సాగుచేస్తున్న పండ్లలో రెండో అతి పెద్ద పంట ఇదే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. ఒక్క అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లోనూ ఇది పండుతుంది. దీని సాగుకు ఉష్ణ ప్రాంతాలు అనువైనవి. సాధారణంగా మే నుంచి అక్టోబరు వరకు ప్లమ్‌ సీజన్‌ ఉంటుంది. ఈ చెట్టు తొలుత చైనాలో పెరిగింది. తరువాత జపాన్‌లో అభివృద్ధి చెంది, ప్రపంచమంతా విస్తరించింది. ఆల్‌బుఖరాలో 19 జాతులున్నాయని కొందరు… కాదు 40 ఉన్నాయని మరికొందరు వాదిస్తారు. వాస్తవానికి ఎన్ని ఉన్నాయన్న దానికి కచ్చితమైన లెక్క లేదు. డామ్‌సన్‌, గ్రీన్‌గేజ్‌, యల్లోగేజ్‌, విక్టోరియా, మిరబెల్లే… ఇవి సాధారణంగా కనిపించే ప్లమ్‌ వెరైటీలు. మిరబెల్లే ఫ్రాన్స్‌లో, డామ్‌సన్‌ ప్లమ్‌ హంగేరీలో పండుతాయి. ఒకరకంగా ఇవి ఆప్రికాట్‌, ఆపిల్‌, రాస్‌బెర్రీ, చెర్రీ, స్ర్టాబెర్రీ, బాదం రకానికి చెందిన పండ్లు. చైనీయుల సంస్కృతిలో ఈ పండును శుభసూచకంగా భావిస్తారు. ఆహా.. ఆల్‏బుఖరా..పోషకాల గని!సీజనల్‌గా లభించే ఆల్‌బుఖరా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందంటున్నారు న్యూట్రిషన్లు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండు పోషకాల గని. విటమిన్‌ సి ఎక్కువగా లభించే ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లలా పనిచేస్తాయి. దానితో పాటు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజాలుంటాయి.

కొన్ని రకాల ఆయుర్వేద మందుల్లో ఆల్‌బుఖరాను ఉపయోగిస్తున్నారు. బయోయాక్టివ్‌ కాంపౌండ్స్‌, ఫినొలిక్‌ యాసిడ్స్‌, కెరొటినాయిడ్స్‌, పెక్టిన్‌, మినరల్స్‌ వంటివి ఆల్‌బుఖరాలో ఉంటాయి. రుతుక్రమంలో తేడా, గర్భస్రావం వంటి సమస్యలను పోగొట్టేందుకు ఉపయోగించే ఔషధాలలో ఈ పండును వాడతారు.ఈ పండులో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. సుక్రోజ్‌, ఫ్రక్టోస్‌, గ్లూకోజ్‌, ఆర్గానిక్‌ యాసిడ్స్‌, ఫైబర్‌తో పాటు ఇతర ఎంజైమ్స్‌ ఉన్నాయి. మలబద్ధకంతో బాధపడుతున్న వారు తీసుకోదగిన పండు ఇది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్‌, సార్బిటాల్‌ వంటివి విరేచనాలు సాఫీగా అయ్యేలా చేస్తాయి. ఈ పండ్లు తింటే జీర్ణవ్యవస్థ గాడిలో పడుతుంది.

ఆల్‌బుఖరా పండ్లతో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి వస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌ కంటి సమస్యలను తగ్గిస్తుంది. వయసు పైబడటం వల్ల వచ్చే కంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా నోటి కేన్సర్‌, లంగ్‌ కేన్సర్‌ ముప్పు నుంచి కాపాడతాయి.అధిక రక్తపోటును నియంత్రించుకోవడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఐరన్‌, పొటాషియం రక్తపోటుతో పాటు, హార్ట్‌రేట్‌ని నియంత్రించడంలో సహాయపడతాయి.విటమిన్‌-ఎ, విటమిన్‌-సి, ఫోలేట్‌, విటమిన్‌-కే, విటమిన్‌ బి1 వంటి పోషకాలకు, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌, కాల్షియం, పొటాషియం వంటి లవణాలకు ఈ పండు పవర్‌హౌజ్‌లాంటిది. ఈ పండు గుండెకు చాలా మేలు చేస్తుంది. రక్తనాళాల్లో రక్తసరఫరా సాఫీగా జరిగేలా చూడటంలో సహాయపడుతుంది. కార్డియాక్‌ అరెస్ట్‌, స్ట్రోక్‌ వంటి గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.ఆల్‌బుఖరాలో ఉండే ఐరన్‌, కాపర్‌ ఎర్రరక్తకణాల తయారీలో తోడ్పడతాయి. ఆలుబుఖరాలోని ఫైబర్‌, సోర్బిటాల్‌ జీర్ణవ్యవస్థకు మేలుచేస్తాయి. పేగులను శుభ్రం చేసి, వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. మలబద్దకంతో ఇబ్బంది పడేవారికి డ్రైడ్‌ ప్లమ్స్‌ ఔషధంలా పనిచేస్తాయి.
ts
సౌందర్య పోషణలో…
ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యపోషణలో కూడా ఈ పండును వాడతారనే విషయం చాలామందికి తెలియదు.
స్కిన్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను ఆల్‌బుఖరా దూరం చేస్తుంది. ఒక బౌల్‌లో రెండు మూడు ఆల్‌బుఖరా పండ్లను తీసుకుని గుజ్జులా చేసి ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మం మెరిసిపోతుంది.ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలా్ట్రవయొలెట్‌ కిరణాల నుంచి చర్మానికి రక్షణగా పనిచేస్తాయి. రెండు మూడు ఆల్‌బుఖరా పండ్లను నీళ్లలో మరిగించి మెత్తగా చేసుకుని, కొద్దిగా పెరుగు వేసి ముఖానికి రాసుకుంటే చాలు. ఆల్‌బుఖరాలో ఉండే విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. కొత్త మెరుపు సంతరించుకునేలా చేస్తాయి. ముడతలు దూరమవుతాయి. కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమల సమస్య ఉన్న వారికి ఇది మంచి రెమెడీగా పనికొస్తుంది. చర్మం బిగుతుగా మారేలా చేసి, యవ్వనంగా తయారయ్యేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి, అలర్జీల సమస్యను దూరం చేస్తుంది. ఆల్‌బుఖరా పండ్లను గుజ్జుగా చేసి, కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు బలోపేతం అయి జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ పండ్లను చక్రాల్లా తరిగి కళ్లపై పెట్టుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ తొలగిపోతాయి. కళ్ల కింద పఫీనెస్‌ తగ్గిపోతుంది.సాధారణంగా సీజనల్‌గా దొరికే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మిగతా పండ్లలాగా ఆల్‌బుఖరా వైపు చూడరు కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు తక్కువేం కాదంటున్నారు న్యూట్రిషన్లు. సో… ఇన్ని ప్రత్యేకతలున్న ఆల్‌బుఖరాను ఒక్కసారి రుచిచూస్తే ఎవరైనా ‘ఆహా’ అనాల్సిందే.

ఇలా కూడా తినొచ్చు…
ఆల్‌బుఖరాను పండ్ల రూపంలోనే కాకుండా రకరకాల పద్ధతుల్లో రుచికరంగా తినొచ్చు. వాటితో పన్నా, చట్నీ, జామ్‌లు చేసుకుని ఆరగించొచ్చు. ఆల్‌బుఖరా పండ్లలోని విత్తనాలు తీసేసి ఒక పాత్రలో తీసుకుని కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించాలి. తరువాత తగినంత పంచదార, కొద్దిగా దాల్చినచెక్క పొడి, నిమ్మరసం వేయాలి. పంచదార కరిగే వరకు ఉంచుకుని దింపుకొంటే జామ్‌ రెడీ. ఈ జామ్‌ను సీసాలో భద్రపరుచుకుంటే పిల్లలు బ్రెడ్‌, చపాతీ, పూరీతో ఇష్టంగా తింటారు.ఒక బౌల్‌లో ఐదారు ఆల్‌బుఖరా పండ్లను తీసుకుని కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత వాటిని చెంచాతో గుజ్జుగా చేయాలి. గుజ్జుగా చేసినప్పుడు వచ్చే జ్యూస్‌ని మరొక పాత్రలో పట్టుకోవాలి. జాలీతో వడబోసుకుని పుదీనా, బ్లాక్‌ సాల్ట్‌, జీలకర్ర పొడి వేసి ఒకసారి మిక్సీలో పట్టుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేసుకుంటే ఈ పన్నా చాలా రుచిగా ఉంటుంది.జీలకర్ర, ఎండుమిర్చిని వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆల్‌బుఖరా పండ్లను వేసి చిన్నమంటపై వేయించాలి. కొద్దిగా ఉప్పు, పంచదార వేసి చిన్నమంటపైనే మరో పదినిమిషాలు ఉడికించాలి. పండ్లు మెత్తగా ఉడికిన తరువాత చెంచాతో గుజ్జుగా చేయాలి. ఇప్పుడు జీర, కారం పొడి వేసి కలుపుకోవాలి. చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఈ చట్నీ నిలువ ఉంటుంది.