ఎన్నో కష్టనష్టాలకోర్చి ఏడుకొండలు ఎక్కి, తిరుమలలో శ్రీవారి దర్శనంతో అలౌకికమైన ఆనందానుభూతిని మూటకట్టుకునే భక్తులు… ఆ స్వామికి కానుకల సమర్పణలో కూడా అమితమైన ఆత్మతృప్తిని పొందుతారు. అదేం మహిమోగానీ వడ్డీకాసులవాడి ‘హుండీ’ అనునిత్యం కానుకలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడిదాకా రకరకాల కానుకలు సమర్పించే ఆ కోనేటి రాయుడి ‘కొప్పెర’ (హుండీ) విశేషాలే ఈ వారం కవర్‌స్టోరీ…
తిరుమల వెంకన్నకు నాటి ఆకాశరాజు నుంచి నేటి భక్తుల దాకా… తమ స్థాయిని బట్టి నగదు, ఆభరణాలు సమర్పించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి ఖజానాకు హుండీ ద్వారా నగదు, బంగారం, వెండి కానుకలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో గడిచిన నాలుగు నెలల కాలంలో శ్రీవారి హుండీ నాలుగుసార్లు సెంచరీ కొట్టడమే కాకుండా… టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో గత నెలలో రూ.130 కోట్లు రావడం గమనార్హం. స్వామివారి హుండీ మహత్యం అది.
17వ శతాబ్దం ముందు నుంచే…
శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించే వస్త్రంతో కూడిన గంగాళాన్ని ‘హుండీ’ అంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు. 17వ శతాబ్దానికి ముందు నుంచే శ్రీవారి ఆలయంలో హుండీ ఉన్నట్టు దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడినప్పటికీ టీటీడీ మాత్రం హుండీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. హుండీలో భక్తులు తమ స్తోమతకు తగిన విధంగా నగదు, బంగారు, వెండి, బియ్యం, వస్ర్తాలు, విలువైన పత్రాలు వంటి వాటిని కానుకలుగా వేస్తారు. నిటారుగా పెద్ద సంచె ఆకృతిలో ఏర్పాటు చేసిన తెల్లని వస్త్రపు తెరలో పెద్ద రాగి గంగాళాన్ని దించి, పై గుడ్డను తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖుచక్రనామాలు చిత్రీకరించబడి ఉంటాయి. భక్తులు వేసే కానుకలు నేరుగా గంగాళంలో పడతాయి. ఈ గంగాళాన్ని ‘శ్రీవారి కొప్పెర’ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇదే అసలు పేరు. కానీ, హుండీనే వాడుకలో ఉండిపోయింది. భక్తుల కానుకలతో నిండిన హుండీ కి అధికారులు లక్కతో సీళ్లు వేస్తారు. హుండీని పరకామణికి తరలించి అక్కడ పరకామణి, విజిలెన్స్, ఆలయం, బొక్కసం వంటి విభాగాల అధికారుల సమక్షంలో తెరుస్తారు. తర్వాత లెక్కింపులు ప్రారంభమవుతాయి.
శ్రీచక్రం వల్లే…
పురాణాల ప్రకారం హుండీ ఉన్న ప్రాంతంలో జగద్గురువైన శ్రీమచ్ఛంకర భగవత్పాదులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన సంపద హుండీలోకి చేరుతోందని నమ్మకం. శ్రీవారి హుండీ కింద శ్రీచక్రమున్నట్లు 1992లో టీటీడీ వేదపండితుడు శ్రీరామనాథ ఘనాపాటి తన రచనలో తెలిపారు. తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ తవ్వకాల్లో శ్రీచక్రమున్న విషయాన్ని గుర్తించి వెల్లడించారు. అందుకే ఆలయంలో ఎన్ని మార్పులు జరిగినా హుండీ స్థానం మాత్రం మారలేదని అర్థమవుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి హృదయంపై శ్రీమహాలక్ష్మీ అమ్మవారు ఉండటంతో అంతులేని సంపద హుండీ ద్వారా వస్తోందని భక్తుల నమ్మకం. శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుని వద్ద నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ భక్తులు శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. కొంతమంది గోవిందునిపై నమ్మకంతో బంగారు అభరణాలను కూడా సమర్పిస్తారు. తొలి రోజుల్లో అణాలతో ప్రారంభమై ప్రస్తుతం రూ.5 కోట్లకు పైగానే హుండీ ఆదాయం లభిస్తోంది.
వృద్ధుడి రూపంలో …
కలియుగ వైకుంఠ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరునికి సేవలందించిన వారిలో ఎందరో మహనీయులున్నారు. దట్టమైన తిరుమలగిరుల్లో వెలసిన శ్రీనివాసుడికి పుష్పకైంకర్యానికి పూనుకున్న అనంతాళ్వారు నుంచి నేటి సాధారణ భక్తుల వరకు గోవిందుడికి ఏదో ఒక రూపంలో సేవ చేసేవారు లెక్కలేనంతమంది ఉన్నారు. తమ స్తోమతకు తగిన విధంగా కానుకలు అందజేయటంతో పాటు వివిధ రకాల సేవలకు పూనుకుని తిరుమలేశుడి సేవలో తరిస్తున్నారు. ఇందులో భాగంగానే భక్తులు కానుకలు సమర్పించే హుండీ గంగాళాన్ని ఓ కుటుంబం తరతరాలుగా అందజేస్తోంది.
అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల కొండకు చేరి శ్రీవారికి కానుకలు సమర్పించే సంప్రదాయం తొలిరోజుల నుంచే ఉండేది. శ్రీవారికి హుండీ ఏర్పాటు చే యక ముందు భక్తులు తమ కానుకలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి వెళ్లిపోయేవారు. ఈ పరిస్థితే ‘కొప్పెర సమర్పణ కథ’కు పునాదిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొప్పెర వంశస్థులుగా చెప్పుకునే కుటుంబం 1821లో పులిచర్ల మండలం చిగరమాకలపల్లె నుంచి తిరుమల కొండకు ఎడ్లబండిలో బయలుదేరింది. అలా ప్రయాణిస్తుండగా ప్రస్తుత భాకరాపేట అడవుల సమీపంలో తమతో పాటు తెచ్చుకున్న ఆహారాన్ని తినేందుకు ఓ చోట నిలిచారు. అంతలో ఓ వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు. ఆకలితో ఉన్నాడని గమనించిన ఆ కుటుంబం ఆ పెద్దాయనకు భోజనం పెట్టింది. ఆహారాన్ని తీసుకున్న తర్వాత వృద్ధుడు ఆ కుటుంబంతో మాట్లాడుతూ ‘మీరు ఆహారం తెచ్చుకున్న గంగాళాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచండి. భక్తులు సమర్పించే కానుకలు ఆ గంగాళంలో పడేలా చేయండి’ అంటూ చెప్పి మాయమైపోయాడు. తిరుమలకు చేరుకున్న ఆ కుటుంబం అడవిలో కోసుకొచ్చిన పుష్పాలు, ఫలాలతో నింపి గంగాళాన్ని స్వామికి కానుకగా తొలిసారి అందజేశారు. ఆ తర్వాత 1825లో మరోసారి శ్రీవారిని దర్శించుకున్న ఆ కుటుంబానికి చెందిన సుబ్బయ్య-వెంకట రమణయ్య అనే వ్యక్తి గంగాళంలో కానుకలు నిండి కిందపడిపోవటాన్ని గుర్తించాడు. ఈ తరుణంలోనే కానుకలు కిందపడిపోకుండా, మరెవ్వరు హుండీలోని కానుకలు దొంగిలించకుండా తొమ్మిది అడుగుల ఎత్తుతో గంగాళం చుట్టూ వస్ర్తాన్ని ఏర్పాటు చేశారనే కథ ప్రచారంలో ఉంది.
ఇంగ్లీషు దొర ఆదేశాలతో…
1825 తర్వాత శ్రీవారికి కొప్పెర ఎవరు సమర్పిస్తున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న అప్పటి పాలకులైన ఇంగ్లీషుదొర బ్రూస్ ఆ కుటుంబానికే కొప్పెర నిర్వహణ బాధ్యతలు అప్పగించారట. ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహించేందుకు తిరుపతికి సమీపంలోని ‘కొప్పెరవాండ్లపల్లి’ అనే గ్రామంలో కొంత భూమిని కూడా ఆ కుటుంబానికి ఇచ్చారట. అప్పటి నుంచి నూతన కొప్పెరను ఏర్పాటు చేయటం, వాటి ద్వారా వచ్చే నగదును పాలకులకు అందజేయటం, కొప్పెరకు కాపలా ఉండటం వంటి వ్యవహారాలు కొప్పెర వంశస్థులే చూసుకుంటూ వచ్చారు. అయితే కొన్ని కారణాలతో 1914లో వారు కొప్పెర నిర్వహణ నుంచి తప్పుకున్నారు. వారు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 1914 నుంచి ఆ సేవ నిలిచిపోయింది.
వాటికీ ఓ లెక్కుంది…
అప్పట్లో మహంతులు కొప్పెరను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తమ పూర్వీకులు తిరుమల గోవిందుడికి ప్రారంభించిన అద్భుతమైన ‘కొప్పెర’ గురించి తాత ముత్తాల నుంచి తెలుసుకున్న తిరుపతికి చెందిన సాయిసురేష్ తిరిగి ప్రారంభించేందుకు తమకు అవకాశమివ్వాలని 2001 నుంచి పోరాడుతూ వచ్చాడు. ఎట్టకేలకు 2016లో తొలిసారిగా కొప్పెర సాయిసురేష్ శ్రీవారికి 75 కిలోల కొప్పెర (పంచలోహాలతో తయారు చేసిన గంగాళం)ను కానుకగా సమర్పించారు. ‘ప్రతి ఏడాది శ్రీవారికి కొప్పెర గంగాళాలు కానుకగా ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించవచ్చు’ అంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వరుసగా గంగాళాలను అందజేస్తున్నారు. సాయిసురేష్ స్వయంగా శ్రీవారి కొప్పెర గంగాళాల తయారుచేయిస్తారు. కొప్పెర గంగాళం చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ దాని తయారీ నేటికీ రహస్యంగానే ఉంది. లక్ష్మీమంత్ర యుక్తంగా తయారుచేసే ఈ గంగాళాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుందట. ఇత్తడి, రాగితో పాటు మరో మూడు రకాల లోహాలను కొప్పెర గంగాళం తయారీకి ఉపయోగిస్తారు. మిగిలిన మూడురకాల లోహాల గురించి రహస్యంగానే ఉంచారు. ఒక గంగాళం తయారీకి దాదాపు నెల రోజుల సమయం పడుతుంది. కాగా ఏ పరిమాణంలో గంగాళాన్ని తయారు చేస్తారనే విషయానికొస్తే దానికీ ఓ లెక్కుంది. శుక్రవారం ఏకాదశి రోజునైతే 27 అంగుళాల ఎత్తు, మంగళవారం ఏకాదశి రోజునైతే 25 అంగుళాల ఎత్తుతో 75 నుంచి 85 కిలోల బరువు ఉండేలా తయారుచేస్తారు. శుక్ర, మంగళవారాలతో ఏకాదశి ఏడాదిలో రెండుమూడు రోజుల్లో మాత్రమే వస్తుంది… కాబట్టి ఆయా రోజుల్లో గంగాళాలను కానుకగా ఇచ్చేందుకు కొప్పెర వంశస్థులు మక్కువ చూపుతున్నారు. గంగాళంతో పాటు తెల్లటి వస్త్రం, నామాల కోసం ఎరుపు, పసుపు వస్ర్తాలు, దారాలను కూడా అందజేస్తున్నారు.
కట్టుదిట్టమైన నిఘా…
హుండీలో భక్తులు వేసేవాటిలో చిల్లర నాణేలు, స్వదేశీ, విదేశీ కరెన్సీ నోట్లు, పురాతన నాణేలు, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు, ముడుపులు, విలువైన పత్రాలు, కోర్కెల చిట్టాలు, శుభలేఖలు, విజిటింగ్ కార్డులు, కలకండ, బియ్యం, పసుపు… ఇలా వివిధ రకాలు ఉంటాయి. వీటన్నింటిని ఆలయంలోని ఆనంద నిలయం వెనుక భాగంలోని ‘పరకామణి’ అని పిలిచే స్థలంలో లెక్కిస్తారు. 1965 వరకు హుండీలోని కానుకలను బంగారువాకిలి వద్దే లెక్కించేవారు. అయితే కానుకలు పెరగడంతో లెక్కింపు కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో రోజు 12 నుంచి 13 గంగాళాలు నిండుతాయి. సన్నిధి సూపరింటెండెంట్ లేదా సీలింగ్ అధికారి, విజిలెన్స్ అధికారులు కానుకలతో నిండిన గంగాళానికి సీల్ వేస్తారు. అలా సీల్ వేసిన గంగాళాలను తొలుత బంగారు వాకిలికి తరలించి ఆ తర్వాత రాత్రి ఏకాంత సేవ సమయానికి స్ట్రాంగ్ రూమ్‌కు చేరుస్తారు. వీటి వివరాలను ఓ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వీటితో పాటు ఉప ఆలయాల నుంచి 2, స్టీల్ మొబైల్ హుండీ, అఖిలాండం (కొబ్బరికాయలు సమర్పించే ప్రాంతం) నుంచి 7 హుండీలు ఉంటాయి. వీటన్నింటిని ఉదయం 7 గంటలకల్లా పరకామణికి తరలిస్తారు. ఇక్కడ దాదాపు 27 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. ముందురోజు హుండీకి వేసిన సీళ్లు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. తర్వాత హుండీని తెరిచి లెక్కింపులు ప్రారంభిస్తారు.
పరకామణిలో విధులు నిర్వహించే వారికి ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. బనియన్, పంచెను ధరించే కానుకలు లెక్కింపుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పరకామణికి ఏ, బీ అనే షిఫ్ట్‌లు ఉంటాయి. ప్రస్తుతం హుండీ లెక్కింపులను వేగవంతం చేసేందుకు సీ షిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. సేవకులు డినామినేషన్ ప్రకారం నగదును వేరు చేస్తారు. రూ.2 వేల నుంచి రూ.500, 200, 100 నోట్లను మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తిచేశారు. ఆ తర్వాత రూ.50, 20, 10 నోట్లు, వీదేశీ కరెన్సీ-నాణేలు, చె క్కులు రాత్రిలోపు పూర్తిచేస్తారు.
ఆలయం వెలుపలకు ‘పరకామణి’
హుండీలోని డబ్బును తరలించి లెక్కించే చోటును ‘పరకామణి’ అంటారు. ప్రస్తుతం ఆలయంలోని పరకామణిలో స్థలం తక్కువ కావడంతో హుండీ లెక్కింపులు వేగంగా జరగడం లేదు. మరోవైపు హుండీ ద్వారా వచ్చే చిల్లరనాణేలు, నోట్లతో పాటు తడిపదార్థాలైన కలకండ, బెల్లం, భక్తులు ముడుపుగా సమర్పించే తలనీలాల ద్వారా కీటకాలు, ఎలుకలు పెరిగిపోతున్నాయి. పరకామణి సిబ్బంది దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు వంటివి లేకపోవడంతో టీటీడీ అధికారులు పరకామణిని ఆలయం నుంచి వెలుపలకు తీసుకురావాలని నిర్ణయించారు. బెంగుళూరుకు చెందిన కొట్టు మురళీకృష్ణ అనే దాత సరికొత్త పరకామణి భవన నిరా.్మణానికి ముందుకు వచ్చారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం ఎదురుగా ఉన్న ప్రదేశంలో నూతన పరకామణి భవనం నిర్మాణం పనులను వేగంగా సాగుతున్నాయి. 14,962 చదరపు అడుగుల విస్తీర్ణలో దాదాపు రూ.18 కోట్లతో నిర్మాణం జరుగుతోంది.ఏరోజు నాణేలను ఆరోజు లెక్కించి డినామినేషన్ ప్రకారం వేరు చేసేందుకు వీలుగా జర్మనీలో తయారుచేసిన రెండు యంత్రాలను ఈ భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం శ్రీవారి హుండీలో 13 రకాల నాణేలు కానుకలుగా వస్తున్నాయి. ఈ నాణేలను లెక్కించి ఆటోమేటిక్‌గా ప్యాకింగ్ చేసేందుకు రెండు యంత్రాలను కొనుగోలు చేయనున్నారు. అలాగే పరకామణి ప్రక్రియను భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా బుల్లెట్‌ఫ్రూఫ్ అద్దాలను అమర్చనున్నారు. మొత్తానికి తిరుమల కొండపై వెంకన్న గురించి చెప్పుకునే కథలే కాదు… కోనేటి రాయుడి కొప్పెరలో కానుకలు కూడా భక్తులకు దివ్యత్వంతో కూడిన ఆశ్చర్యమే కదా.
‘పరకామణి’ సేవలో…
‘పరకామణి’ నగదు లెక్కింపుల్లో ఖచ్చితత్వాన్ని తీసుకువచ్చేందుకు టీటీడీ 2012 ఆగస్టు 20వ తేదీ నుంచి ‘పరకామణి సేవ’ను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, భీమా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న లేదా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. పరకామణి సేవలో పాల్గొనేందుకు ఉద్యోగులు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా పరకామణి సేవకుల కోటాను విడుదల చేస్తారు. ప్రధానంగా పరకామణి సేవలో రెండు రకాలుంటాయి. 4 రోజులు, 3 రోజుల సేవ ఉంటుంది. 4 రోజుల సేవకు నమోదు చేసుకున్న సేవకులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 3 రోజుల సేవ వారు గురువారం మధ్యాహ్నం రిపోర్ట్ చేయాలి. వీరికి కొన్ని సందర్భాల్లో తిరుపతి పరకామణిలో కూడా విధులు కేటాయిస్తారు. 2012 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల నుంచి దాదాపు లక్షా నలభై వేల మంది పరకామణి సేవలో పాల్గొని ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా సేవలందించారు.
‘శ్రీవారి ధన ప్రసాదం’
‘శ్రీవారి ధన ప్రసాదం’ పేరుతో హుండీ ద్వారా వచ్చిన చిల్లర నాణేలను భక్తులకు అంద జేసే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. హుండీలో నోట్లతో పాటు చిల్లర నాణేలు కూడా భారీగా పడుతుంటాయి. ఈ చిల్లర నాణేలను తీసుకునేందుకు కొన్ని బ్యాంకులు నిరాకరిస్తున్న క్రమంలో శ్రీవారి ప్రసాదంగా వాటిని భక్తులకు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి హుండీలోని చిల్లర కావడంతో భక్తులు భక్తిభావంగా స్వీకరించి ఇంట్లో పెట్టుకుంటారని భావించిన టీటీడీ 2021 ఆగస్టు 31 నుంచి అమలుచేస్తోంది. తిరుమలలో గదుల కోసం తీసుకునే కాషన్ డిపాజిట్ స్థానంలో చిల్లర నాణేలను అందజేసేలా టీటీడీ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం వంద రూపాయి నాణేలు కలిగిన ప్యాకెట్లను కౌంటర్లలో భక్తులకు అందజేస్తున్నారు. హుండీలో పడిన నగదు కావడంతో చాలామంది భక్తులు ధనప్రసాదాన్ని స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ లెక్క!
సాధారణంగా శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు రూ.2.30 నుంచి రూ.3.50 కోట్ల దాకా లభిస్తుంది. రద్దీరోజులు, విశేషపర్వదినాల్లో రూ.4 కోట్ల వరకు కానుకలు అందుతుంటాయి. గత ఏడాది నుంచి స్వామి హుండీ రోజూ రూ.4 నుంచి రూ.4.50 కోట్ల వరకు రికార్డు అవుతోంది. నెలలో ఒకటిరెండు సార్లయినా రూ.5 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఇలా ప్రతి నెల హుండీ ఆదాయం సుమారు రూ.వంద కోట్లకుపైగా ఉంటోంది. ఒక్కరోజు లభించిన హుండీ ఆదాయం రికార్డు విషయానికి వస్తే… 2018 జూలై 26న అత్యధికంగా రూ.6.28 కోట్లు.
డిపాజిట్ల రూపంలో…
హుండీలో సమర్పించే కానుకల్లో ఆలయ నిర్వహణకు పోగా కార్పస్‌ఫండ్‌గా పరిగణించి దాదాపు 60 శాతం డిపాజిట్లు బ్యాంకుల్లో వేయటం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్ధానంకు చెందిన దాదాపు రూ.10,420.21 కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉన్నాయి. కాగా ఈ మొత్తం మీద టీటీడీకి 4.70 నుంచి 7.10 శాతం వడ్డీ వస్తోంది. అలాగే హుండీ ద్వారా నెలకు సుమారు 70 నుంచి 80 కిలోల బంగారం, 400 నుంచి 500 కిలోల వెండి లభిస్తోంది. ఇప్పటివరకు పలు బ్యాంకుల్లో దాదాపు 10,258.368 కిలోల బంగారం డిపాజిట్ల రూపంలో ఉంది.