తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పంచమూర్తులైన కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపనతిరుమంజనం చేపట్టారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, సూపరింటెండెంట్లు భూపతి, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
1. ఆగస్ట్ 1 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన- ఈవో ధర్మారెడ్డి
కరోనా నేపథ్యంలో తిరుమలలో కొంతకాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్ట్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో ఏపీ ధర్మారెడ్డి చెప్పారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్‌లో తిరుపతిలో ప్రారంభమైన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటివరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినట్లు చెప్పారు.అక్కడ ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతులు తిరుపతిలోని గోశాలను సంప్రదిస్తే వారికి గోవులు, ఎద్దులను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూన్‌లో శ్రీవారిని 23.23 లక్షల మంది దర్శించుకుని, రూ.123.74 కోట్లను హుండీలో వేసినట్లు ఈవో చెప్పారు.
**12న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఈ నెల 17న ఆణివార అస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది.
2.గుట్టలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన – ఈ నెల 29 నుంచి నెల రోజులపాటు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 29 నుంచి శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకుడు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో 30 మంది రుత్వికులు పాల్గొని రోజుకు అమ్మవారి నామాన్ని 3.60 లక్షల సార్లు జపిస్తారని వారు పేర్కొన్నారు. 30 రోజుల వరకు కోటి 8 లక్షల లక్ష్మీ నామస్మరణ పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. శనివారం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 7 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.ఇందులో పాల్గొనే భక్తులకు వారి గోత్ర నామాలతో సంకల్పం చేసి 30 రోజులపాటు పూజలు నిర్వహించి శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తామన్నారు. దంపతులకు రూ.2 వేల ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం మొట్టమొదటిసారిగా జరిగే కోటి కుంకుమార్చన ఉత్సవాలను అత్యంత వైభవంగా చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. మహిళా సౌభాగ్యం, లోకకల్యాణం, విశ్వశాంత్యార్థం, క్షేత్ర అభివృద్ధి, మహామంత్ర శక్తి సమర్పణం, యంత్రశక్తి ఉద్దీపనలు అనుసరించి ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు చెప్పారు. భక్తులంతా కుంకుమార్చనలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.