DailyDose

జులై 12న తెలంగాణాకు రానున్న ద్రౌపది ముర్ము -TNI తాజా వార్తలు

జులై 12న తెలంగాణాకు రానున్న ద్రౌపది ముర్ము   -TNI  తాజా వార్తలు

* ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం తెలంగాణకు రానున్నారు.మధ్యాహ్నం 3గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈసందర్భంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను కలువనున్నారు.ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గానూ పనిచేసిన ముర్ము రాజకీయాల్లో కింది స్థాయి పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి చేరుకున్నారు. కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీపడే స్థాయికి ముర్ము అంచెలంచెలుగా ఎదిగారు. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టించనున్నారు.

* తిరుమల లో కొనసాగుతోన్న భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 87,478 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 48,692 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

*తిరుమలలో శుక్రవారం నుండి చలి తీవ్రత పెరిగినట్లయింది. బుధవారం నుంచి తిరుమలలో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎండనే మాటే లేకుండా పోయింది. అడపాదడపా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం నుంచి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది.ఈ పరిణామంతో తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో చాలామంది వృద్ధులు చలికి ఉండలేక స్వామివారి దర్శనం కాబడిన వెంటనే తిరుగు ప్రయాణాలకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.తిరుమలలో చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకున్న టిటిడి బోర్డు వసతి గృహల సముదాయాలలో హాట్ వాటర్ అందించేందుకు ఎప్పటికప్పుడు సన్నాహాలు చేస్తున్నారు.అదే విధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్సీలు,సర్వదర్శనం క్యూ లైన్లలో వేడి వేడి ఆహార పదార్ధాలను నిరంతరం శ్రీవారి సేవకుల ద్వారా అందజేస్తున్నారు.

*మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 73వ జయంతి, రైతు దినోత్సవ ఉత్సవాలను శుక‍్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు సమాఖ్య కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్‌ అని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

*శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మార్పులు వచ్చినా ఎలాంటి పురోగతి కనిపించకపోవటంతో మళ్లీ పెద్ద ఎత్తున లంకేయులు ఆందోళనలకు దిగారు. ఎవరూ ఊహించని విధంగా శనివారం లక్షల మంది ప్రజలు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించారు. భద్రతావలయాన్ని దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే గొటబాయ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్షుడి అధికారిక నివాసంలో ప్రవేశించిన నిరసన కారులు రచ్చ రచ్చ చేశా

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం వద్ద గోదారమ్మ 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ వెల్లడించింది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ప్రస్తుతం 30 అడుగుల వద్ద నది ప్రవహిస్తున్నదని చెప్పారు.

*పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం లో తొలి ఏకాదశి సందర్భంగా శాకంబరీ అలంకారం.

*బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో కమలనాథులు భేటీ అయ్యారు. ముఖ్య అతిథిగా పార్టీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, నాయకులు ఈటల, డీకే అరుణ, మురళీదరరావు, వివేక్, గరికపాటి హాజరయ్యారు. మధ్యాహ్నం ఫైనాన్స్ కమిటీ, ప్రజా సమస్యలు – టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీలతో నేతలు సమావేశమవుతారు. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీలో చేరికలపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఈటల రాజేందర్, ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా జితేందర్ రెడ్డి, ప్రజా సమస్యలు – టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ఎంపీ అరవింద్‌ను నియమించారు. చేరికలతో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు కమలనాథులు.

*పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయానికి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరుతోంది. శనివారం సాయంత్రానికి జలాశయ నీటిమట్టం 403 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 407 అడుగులు కావడంతోపాటు ఇన్‌ఫ్లో 4వేల క్యూసెక్కులు ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ముందస్థు చర్యల్లో భాగంగా రాత్రి 9 గంటలకు 3 గేట్లు ఎత్తి అధికంగా ఉన్న 15 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయనున్నారు. వరద నీటితో కళకళలాడుతున్న కిన్నెరసాని రిజర్వాయర్‌ అందాలను తిలకించడానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా నిండుకుండలా మారిన కిన్నెర అందా లను తిలకించారు.

*కాటారం దగ్గర కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పక్కన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో 24మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి నుంచి వరద నీటిలోనే బస్సు ఉంది. వరంగల్ నుంచి కాళేశ్వరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

*తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. శనివారం సరాసరి లక్ష క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు టీబీ బోర్డు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నీటి ఉధృతిని బట్టి డ్యాం గేట్లు ఎత్తి నదికి ఏ క్షణంలోనైనా నీటిని విడుదల చేస్తామని డ్యాం అధికారులు ప్రకటించారు. నది వైపు ఎవరూ వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహకంలో ఉండే రైతులు, గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. డ్యాం నీటి సామర్థం 105.788 టీఎంసీలు కాగా శనివారం ఉదయం అధికారుల నీటి లెక్కల ప్రకారం 72.951 టీఎంసీలు చేరాయి. ఇన్‌ఫ్లో 95,484 క్యూసెక్కులుగా నమోదయింది. జలాశయం పై ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు డ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంటుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది ఇదే నాటికి 35.533 టీఎంసీల నీరు చేరాయి.

*విల్లుపురం జిల్లా తువాక్కుడి టోల్‌గేట్‌ వద్ద తన కారు అద్దాలపై టోల్‌గేట్‌ స్కాన్‌ కట్టె పడటంతో ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తన మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. విల్లుపురం నుంచి శశికళ కారులో తంజావూరుకు బయలుదేరారు. ఆమె కారుతో పాటు మరో నాలుగు కార్లు వెంట వెళ్ళాయి. తువాకుడి టోల్‌గేట్‌ వద్ద ముందున్న నాలుగు కార్లు చెకింగ్‌ తర్వాత ముందుకు వెళ్ళాయి. చివరగా వెళుతున్న శశికళ కారు అద్దాలపై టోల్‌గేట్‌ స్కాన్‌ కట్టె పడింది. ఈ సంఘటనతో ఆగ్రహించిన శశికళ కారునుంచి దిగి టోల్‌గేట్‌ సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో టోల్‌గేట్‌ సిబ్బంది భయపడి అక్కడి నుంచి పారిపోయారు. శశికళ మద్దతుదారులతో కలిసి టోల్‌గేట్‌ ద్వారాలకు అడ్డంగా కార్లను ఉంచి ధర్నాకు దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఆమెకు సర్దిచెప్పారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తంజావూరుకు బయలుదేరారు.

*తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రచార పర్యటనలో భాగంగా పళ్ళిపట్టు చేరుకున్న సందర్భంగా చెన్నైకి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నగరిలో రోడ్‌షో ముగించుకుని కార్వేటినగరానికి వెళుతున్న చంద్రబాబుకు తమిళనాడులోని పళ్ళిపట్టు వద్ద చెన్నై టీడీపీ నేతలు కలుసుకుని ఆయనను గజమాలతో సత్కరించారు. సుమారు రెండువేలమంది కార్యకర్తలు ‘జైచంద్రబాబు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చెన్నై టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, రాజేష్‌, హోమణ్‌, సానకుప్పం మాజీ కౌన్సిలర్‌ రాజేంద్రనాయుడు, చలపతి, తులసి. సానకుప్పం, పళ్ళిపట్టు చుట్టుపక్కలి గ్రామ ప్రజలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

*గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూడు రోజుల(సోమ, మంగళ, బుధవారాలు) పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

*విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. దాంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికే కాల్వల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా తూర్పు, పడమరలకు నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల పాటు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

*కాళేశ్వరం పుష్కరఘాట్‌ దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. 15 మీటర్ల మేర గోదావరి నీటి ప్రవాహం ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నీటిమట్టం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 75 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8,66,070 క్యూసెక్కులుగా ఉంది. అన్నారం బ్యారేజీ 50 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,55,000 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మూడు రోజులుగా రాష్టంలో వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా వానపడింది. శుక్రవారం దక్షిణ తెలంగాణలో భారీవర్షాలు పడగా.. శనివారం ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది.

*బీజేపీ కార్యాలయంలో చేరికల కమిటీ భేటీ ముగిసింది. ఈనెల 21 నుంచి 119 నియోజకవర్గాల్లో ఒకేసారి బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రజల ఘోష, బీజేపీ భరోసా పేరుతో బైక్‌ ర్యాలీలు కూడా చేపట్టనున్నారు. సరైన అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో చేరికలపై దృష్టి పెట్టారు. చిన్న, పెద్ద నేతలు ఎవరొచ్చినా చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆఖరి నిమిషం వరకు చేరికలను గోప్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. పోడు భూమలు, ధరణి పోర్టల్ సమస్యలపై రేపు కరీంనగర్‌లో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‌మౌన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. గిరిజనులు, రైతులకు అండగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.

*వైసీపీ ప్లీనరీ అంతా ఆత్మస్థుతి.. పరనింద మాత్రమేనని టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు అన్నారు. మీడియాను తిట్టడానికే ప్లీనరీ పెట్టడం ఎప్పుడూ చూడలేదన్నారు. కుడి చేత్తో రూ.10 ఇచ్చి.. ఎడమ చేత్తో రూ.100 దోచుకుంటున్నారని ఆరోపించారు. అమ్మఒడితో రూ.13 వేలు అందించి.. నాన్న బుడ్డీతో రూ.45 వేలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

*వైఎస్ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో మంత్రి అప్పలరాజు వివరించారు. వైసీపీని, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వేరు వేరుగా చూడలేమన్నారు. వైసీపీ జగన్ కష్టంతో కూడుకున్న పార్టీ అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఒక వర్గానికి దారా దత్తం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌కి అసలు నాలెడ్జ్ లేదని విమర్శించారు. రైతుల సమస్యలపై ఆయనకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రచారం కోసం డ్రామాలు వేయటం సర్వసాధారణం వాటిని సినిమా కోణంలో జనం చూడాలన్నారు.

*ఎల్లంపల్లి ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తి 1.31 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 15.04 టీఎంసీలుగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు మత్త పారుతున్నాయి.

*కాంగ్రెస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఏఐసీసీ కార్యదర్శిగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. కర్ణాటక రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి సహాయకంగా ఇంచార్జి కార్యదర్శి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. శ్రీధర్‌బాబుతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన మరో నలుగురినీ కార్యదర్శులుగా నియమించి కర్ణాటక ఇంచార్జి కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. తాజాగా శ్రీధర్‌బాబుకూ అవకాశం రావడంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితుడైన శ్రీధర్‌బాబును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు సన్మానించారు.

*వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (రెండో సవరణ) చట్టం-2017 రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టం ప్రకారం నోటీసులు జారీచేయడం చెల్లదని పేర్కొంది. జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఇంకా గతంలోని వ్యాపార వ్యవహారాలకు సంబంధించి వ్యాట్‌ రెండో సవరణ చట్టం కింద నోటీసులు జారీ చేయడం కుదరదని తెలిపింది. వ్యాట్‌ యాక్ట్‌ – 2005 (పాతచట్టం) ప్రకారం నాలుగేళ్లకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే పన్ను లెక్కించడం, పన్ను విధించే అవకాశం అధికారులకు ఉండేది. అధికారులు విధించిన పన్నుపై అప్పీల్‌ చేసుకోవడానికి 60 రోజుల సమయం ఉండేది. వీటిని సవరించి ఆరేళ్లపాటు జరిగిన వ్యవహారాలకు పన్ను లెక్కించి.. వసూలు చేసేలా వ్యాట్‌ (రెండో సవరణ)చట్టాన్ని 2017లో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పీల్‌ చేసుకునే వ్యవధిని 60 నుంచి 30 రోజులకు కుదించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కూడా వ్యాట్‌ సవరణ చట్టం ప్రకారం నోటీసులు జారీచేయడాన్ని సవాల్‌ చేస్తూ వివిధ వ్యాపార సంస్థలు హైకోర్టులో 45పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని విచారించిన ధర్మాసనం ఆ నోటీసులు చెల్లవని స్పష్టంచేసింది. సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.

*వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వైఎస్‌ విజయలక్ష్మి త్వరలోనే వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ(వైఎ్‌సఆర్‌టీపీ) గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. గౌరవాధ్యక్షురాలి హోదాలో ఆమె లోట్‌సపాండ్‌ కేంద్రంగా పార్టీకి పూర్తి సమయం కేటాయించనున్నట్టు సమాచారం. విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా నియమించిన తదనంతర కాలంలో పార్టీ దశ మారిందని, అధికారంలోకి వచ్చిందని వైఎ్‌సఆర్‌ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఆ సెంటిమెంట్‌ వైఎ్‌సఆర్‌టీపీకి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

*మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోయపోచగూడలో గిరిజనులు, ఆదివాసీలు పోడు భూములపై వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారం అధికారులు తొలగించిన గుడిసెల స్థానంలో రాత్రికి రాత్రే మళ్లీ గుడిసెలు వేసుకొన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టి నిర్బంధించినా వెనక్కు తగ్గబోమంటున్నారు. తమకు సాగు భూములు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని తెగేసి చెబుతున్నారు. గుడిసెల విషయం అధికారులకు తెలిసినా అటువైపు వెళ్లలేదు. ఇదిలా ఉండగా, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారె్‌స్టలో భూ ఆక్రమణ నేరమని జన్నారం అటవీ డివిజనల్‌ అధికారి మాధవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోయపోచగూడ గ్రామస్థులు అటవీ అధికారులకు సహకరించాలని కోరారు.

*డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్‌ అభ్యర్థులకు ఆగస్టు 1 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. అడ్మిషన్లు పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అడ్మిషన్ల నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

*భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి శనివారం ఆర్జిత సేవలో అంతరా లయంలో సువర్ణ తులసార్చన నిర్వహించారు. బేడా మండపంలో నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా స్వామిని నిత్య కల్యాణ మండప వేదిక వద్దకు తీసు కురాగా సహస్రనా మార్చన తొలుత నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణ ప్రక్రియలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, యోక్త్రబంధనం, కన్యాదా నం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, బ్రహ్మముడి, తలంబ్రాలు, వేద ఆశీర్వచనం నిర్వహించారు.

*సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌కు 10-15 నిమిషాలకు ఒక మెట్రోఎక్స్‌ప్రెస్‌ చొప్పున బస్సులు నడపాలని గ్రేటర్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ సేవలు విస్తరిస్తూ ఈనెల 11నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ యాదగిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.25 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఓ బస్సు సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌కు నడిపేలా రూట్‌మ్యా్‌పలు సిద్ధం చేశారు. అలాగే, వేవ్‌రాక్‌ నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9.55 గంటల వరకు బస్సులు ఉంటాయన్నారు.

*వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రూ.2 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మౌలిక వసతుల కల్పన విభాగం సంయుక్త కార్యదర్శి సామ్యూల్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఇందుకుగాను కేంద్రం రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని, ఇందులో తెలంగాణ కు రూ.3,075 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. టీఎ్‌స-ఆగ్రోస్‌, కేంద్ర వ్యవసాయశాఖ, మేనేజ్‌ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం ఆగ్రోస్‌ నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రవీణ్‌ మాట్లాడుతూ…ఎలాంటి పూచీకత్తు లేకుండా 3 శాతం వడ్డీకి రుణాలు ఇస్తామని, ఏడేళ్లలో తిరిగి చెల్లించేలా పథకాన్ని రూపొందించినట్టు తెలిపారు.

*విజయవాడ: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ కు వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నుంచి 25 వేల క్యూసెక్యుల నీరు కృష్ణాలో చేరుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్‌ ఎనిమిది గేట్లు అడుగు మేర ఎత్తి 8,000 క్యూసెక్యుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. త్రాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా, ఈస్ట్రన్‌ అండ్‌ వెస్ట్రన్‌ కాలువలకు 4,500 క్యూసెక్యుల నీటి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు వెల్లడించారు.

* జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్ విద్యార్థినుల కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జీజీహెచ్‌ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ నేపథ్యంలో బాధితులను ఎస్‌ఎస్‌ఆర్‌ వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. నర్సింగ్ విద్యార్థినిలకు కోవిడ్ నిర్ధారణ కావడంతో వారు విధులు నిర్వహించిన వార్డుల్లోని రోగులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

*డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్‌ అభ్యర్థులకు ఆగస్టు 1 నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. అడ్మిషన్లు పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అడ్మిషన్ల నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

*బక్రీద్‌(ఈద్‌-ఉల్‌-అజ్హా) సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భగవంతుని పట్ల సంపూర్ణ భక్తి, పేదల పట్ల కరుణ, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణిని బక్రీద్‌ వెల్లడిస్తుందని రాజ్‌భవన్‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో గవర్నర్‌ పేర్కొన్నారు. ఇస్లామిక్‌ విశ్వాసంలో బక్రీద్‌ అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. సమాజంలో వితరణ స్ఫూర్తి, సద్భావనను పెంపొందించే బక్రీద్‌ పండుగ అందరిలోనూ మంచికి మార్గం చూపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మహోన్నత త్యాగాన్ని స్మరించుకొంటూ నిర్వహించుకునే పర్వదినం బక్రీద్‌ అని పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ జీవిత సత్యాలను తెలియజేస్తుందన్నారు.

*కోడికత్తి కేసులో నాలుగేళ్లుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న తన కుమారుడిని విడిపించాలని కోరుతూ అతని తల్లి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాశారు. రెండు పేజీల ఆ లేఖను రిజిస్టర్‌ పోస్టు ద్వారా సీజేఐకి పంపించారు. నిందితుడు జనుపల్లె శ్రీనివాసరావు తల్లిదండ్రులు తాతారావు, సావిత్రి ఈ లేఖను చూపుతున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన తమ కుమారుడు శ్రీనివాసరావు జీవనోపాధి నిమిత్తం విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్‌ క్యాంటీన్‌లో సర్వర్‌ బోయ్‌గా చేరాడని ఆ లేఖలో ఆమె తెలిపారు. ‘2018 అక్టోబరు 25వ తేదీన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు శ్రీనివాసరావు టీ సర్వ్‌ చేసే క్రమంలో జేబులో ఉంచుకున్న ఫ్లవర్‌ డెకరేషన్‌కు ఉపయోగించే చిన్న కత్తి జగన్‌ భుజానికి తగిలి స్వల్ప గాయమైంది. ఎయిర్‌పోర్టు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారు.

*ప్రయాణికుడే తమకు దేవుడు.. అనే ఆర్టీసీ యాజమాన్యం వారినే ఇబ్బందులకు గురి చేసింది. దేవుడి కన్నా నాయకుడే ముఖ్యమంటూ అధికార పార్టీకి జై కొట్టింది. అధికార పార్టీ సేవలో తరించడానికే ఇదంతా చేసింది. బస్టాండ్ల నుంచి ప్రయాణికులను బస్సుల్లో తీసుకెళ్లి గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ.. వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద నుంచి కార్యకర్తల్ని గుంటూరు జిల్లాలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీకి తరలించి తరించింది.. ఫలితంగా ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో శనివారం బస్సుల్లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులు కావడంతో సొంత పనులపై పొరుగూళ్లకు, ఇతరత్రా అవసరాలు, శుభకార్యాలకు వెళ్లేందుకు బస్టాండ్లకు వచ్చిన ప్రజలకు బస్సులు కనిపించక పోవడంతో అవాక్కయ్యారు. ఒంగోలు, బాపట్ల, చీరాల, కనిగిరి తదితర ప్రాంతాల్లో గ్రామీణ ప్రయాణికులు బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ అధికారుల వైసీపీ భక్తిపై సాధారణ ప్రయాణికులు మండిపడ్డారు. జాతీయ రహదారి పక్కనే వైసీపీ ప్లీనరీ జరుగుతుండటంతో రెండో రోజైన శనివారం మరిన్ని ఎక్కువ వాహనాలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు, ఇతర వాహనాలను నాయకులు రోడ్డుపైనే ఆపేశారు. ట్రాఫిక్‌ జామ్‌ అవడంతోపాటు వర్షం కురుస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు.

*ఈ నెల 17న ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 12వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ క్రమంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపింది.

*తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూంకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్‌ దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర వ్యాపించింది. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయానికి క్యూలైన్‌లోకి ప్రవేశించిన సర్వదర్శనం భక్తులకు 20 గంటల దర్శన సమయం పడుతోంది.

*రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ ధర టన్నుకు సగటున రూ.1,200 పెరిగింది. ఆయిల్‌పామ్‌ తాజా పండ్లలో చమురు వెలికితీత నిష్పత్తి(ఓఈఆర్‌) శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ధర కాస్త పెరిగింది. గతేడాది ఓఈఆర్‌ 18.682ు ఉండగా, తాజాగా 19.22శాతానికి పెంచింది. దీనిపై ఉద్యానశాఖ కమిషనర్‌ శ్రీధర్‌ ప్రోసీడింగ్స్‌ ఇచ్చారు. ఓఈఆర్‌ పెరుగుదలతో ఆయిల్‌పామ్‌ పండ్ల కొనుగోలు ధర సగటున టన్నుకు రూ.1,200 పెరగనున్నది. గతేడాది టన్ను ఆయిల్‌పామ్‌ గరిష్టధర రూ.20వేలు పలకగా, ఈ ఏడాది రూ.23,400దాకా వస్తోంది.

*అందరికీ అధికారం, అవినీతి లేని రాజ్యం ప్రజాశాంతి పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ తెలిపారు. విశాఖలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మార్పు కోసమే తాను పాత్రికేయుల సమావేశంతోనే యాత్రను ప్రారంభిస్తున్నాని తెలిపారు. ఆదివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ‘పాల్‌ రావాలి…పాలన మారాలి’ నినాదంతో రాష్ట్రంలో యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.

*అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌, తెలంగాణ భవన్‌ అధికారులు వేర్వేరుగా హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. అమర్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులు 011-23384016, 011-23387089 నంబర్లకు ఫోన్‌ చేయాలని ఏపీ భవన్‌ అధికారులు సూచించారు. అలాగే, 011-23380556, 011-23380558 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని తెలంగాణ భవన్‌ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ రాష్ర్టానికి చెందిన యాత్రికుల విషయంలో సీఎంవో అధికారులతో మాట్లాడారు. అలాగే, యాత్రికులతో సమన్వయం చేయడం కోసం ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాంశు కౌశిక్‌ శ్రీనగర్‌కు వెళ్లారు.

*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చిన్నతిరుమలేశుని ఆలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా శనివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు ఆలయ ముఖ మండపంలో అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఈవో వేండ్ర త్రినాథరావు సీజేకు స్వామి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.
*సచివాలయంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ఈ నెల 24న ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రానికి చెందిన 234 మంది శాసనసభ్యులు, 39 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఓటు వేయనున్నారు. ఎంపీలు ఢిల్లీలోనూ లేదా ఇతర రాష్ట్రాలలోనూ ఓటవేయడానికి వీలుంది. అయితే ఎంపీలు ముందుగా తాము ఏ చోట ఓటు హక్కును వినయోగించుకోనున్నారనే విషయాన్ని ముందుగా ఎన్నికల అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలను ముద్రించే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో జరుగనున్న పోలింగ్‌కు బ్యాలెట్‌ పత్రాలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చేందుకు తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నెల 11న శాసనసభ కార్యనిర్వహణ అధికారి విమానంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు. మరుసటి రోజు బ్యాలెట్‌ బాక్స్‌, బ్యాలెట్‌ పత్రాలతో ఆయన విమానంలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ చెన్నైకి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి పోలీసుల భద్రత మధ్య వాటిని సచివాలయానికి తరలించనున్నారు. సచివాలయంలో ప్రత్యేక స్ట్రాంగ్‌ రూమ్‌లో బ్యాలెట్‌ బాక్స్‌, బ్యాలెట్‌ పత్రాలను భద్రపరచనున్నారు. వాటిని ఈ నెల 18న పోలింగ్‌ ముగిసిన రోజు సాయంత్రమే భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు.

*టమోట ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. మొన్నటి వరకు 30 కేజీల బాక్సు రూ.500 ఉండగా, శనివారం నాణ్యతను బట్టి రూ.100-200కు చేరింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం కూలీల, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టమోట సాగు భారీగా పెరగడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు మార్కెట్‌ను శనివారం టమోటాలు ముంచెత్తాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ పంట సాగు భారీగా పెరగడంతో మార్కెట్‌కు భారీగా తెస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి కూడా రైతులు టమోటాలను ఇక్కడికి తీసుకొస్తున్నా గిట్టుబాటు లేకపోవడంతో కుమిలిపోతున్నారు. ఒకటిన్నర నెల క్రితం రూ.1500 పైగా పలికిన బాక్సు ధర క్రమంగా తగ్గి పాతాళానికి చేరింది. ఈ మార్కెట్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ తదితర రాష్ర్టాలకు ప్రతి రోజూ 35 నుంచి 40 లారీల కాయలు వెళ్తున్నాయి. వాహనాల రాకపోకలతో మార్కెట్‌ కిక్కిరిసిపోతోంది.

* ఈ-ఫార్మసీలు, వైద్య పరికరాల నియంత్రణకుగాను కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లును ప్రతిపాదించింది. వీటితోపాటు ఔషధాలు, వైద్యపరికరాల కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే సమయంలో గాయాలు లేదా మరణం సంభవించినప్పుడు పరిహారం చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష సహా జరిమానాలు విధించేలా నూతన డ్రగ్స్‌, మెడికల్‌ డివైజెస్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ ముసాయిదా బిల్లు, 2022లో ప్రతిపాదించింది. నూతన ఔషధాలు, వైద్య పరికరాల క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ నిబంధనలను తొలిసారిగా దీని పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం 1940 స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకురానున్నారు. ప్రస్తుతం నూతన ఔషధాలు, వైద్య పరికరాల కోసం క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణ, క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనడం వల్ల కలిగే గాయాలు లేదా మరణానికి సంబంధించిన పరిహారం నిబంధనలు, ట్రయల్స్‌లో పాల్గొనే వారి వైద్య నిర్వహణ, ఎథిక్స్‌ కమిటీ నియంత్రణ మొదలైనవి నూతన ఔషధాలు, క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనలు, 2019 కింద నియంత్రిస్తున్నారు. అలాగే వైద్య పరికరాలను ఔషధాలుగా పరిగణిస్తుండగా వీటికి ప్రత్యేక నిర్వచనం లేదు. ఇక కొత్త బిల్లు ప్రకారం ఈ-ఫార్మసీని నిర్వహించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్‌లు తీసుకున్న వారు తప్ప మిగతా వారు ఆన్‌లైన్‌లో ఔషధాలు విక్రయించరాదు. ముసాయిదా బిల్లులో ఆయుష్‌ ఔషధాలకు ప్రత్యేక చాప్టర్‌ ఉంది.

*రాష్ట్రంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌ హౌస్‌లో శనివారం తనను కలిసిన కాంట్రాక్టు లెక్చరర్లతో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు 2016లోనే సీఎం కేసీఆర్‌ జీవో 16 జారీ చేశారని, కోర్టు వివాదం కారణంగా ఆలస్యమైందని, ఇటీవలే కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇ ప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తోందని ఆయన చెప్పారు. వినోద్‌ను కలిసినవారిలో రామకృష్ణ గౌడ్‌, జం గయ్య, రమణారెడ్డి, సురేష్‌, శ్రీనివాస్‌, వైకుంఠం, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులున్నారు.

*అంగన్వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో స్థానికత అంశం వివాదంగా మారింది. 25-30 ఏండ్లుగా తెలంగాణలో పనిచేస్తున్న తమను కేవలం ఏపీలో చదువుకున్నామన్న కారణంతో పక్కనపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొంత మంది అంగన్వాడీ టీచర్లు ఆరోపిస్తున్నారు. 433 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి జనవరి 2న పరీక్ష జరిగింది. 16,185 మంది పరీక్ష రాశారు. నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం 1-7వ తరగతి వరకు ఎక్కడ చదివితే అదే స్థానిక ప్రాంతంగా గుర్తిస్తారు. నాన్‌ లోకల్‌ వారికి 5ు రిజర్వేషన్‌ ఉంటుంది. పరీక్ష రాసిన అంగన్‌వాడీ టీచర్లలో చాలా మంది ఏపీలో చదువుకొన్నవారు ఉన్నారు. వివాహం తర్వాత తెలంగాణ జిల్లాల్లోనే అంగన్‌వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు. నోటిఫికేషన్‌లో నిబంధనల ప్రకారం తమను కనీసం నాన్‌ లోకల్‌గా కూడా గుర్తించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ‘నాన్‌లోకల్‌ అంటే ప్రస్తుతం ఉన్న జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉంటుందని, ఒక జోన్‌లో చదివిన వారిని మరో జోన్‌లో నాన్‌ లోకల్‌ గురిస్తామని, వారికి మాత్రమే 5ు రిజర్వేషన్‌ వర్తిస్తుందని.. ఈ మేరకు అధికారులు చెప్తున్నారని వాపోతున్నారు. ఏపీలో చదివిన తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాన్‌లోకల్‌కు 5ు రిజర్వేషన్‌ అని ముందుగా ప్రకటించిన ప్రకారం మొత్తం 433 పోస్టుల్లో తమకు 20కి పైగా పోస్టులు ఇవ్వాల్సి ఉందని డిమాండ్‌ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యాదేవరాజన్‌ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సమస్యను పరిష్కరించడంతోపాటు ఇకపై గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీని సీనియారిటీ ఆధారంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.