DailyDose

జోహన్నెస్‌బర్గ్ బార్‌లో కాల్పులు… 14 మంది మృతి – TNI నేర వార్తలు

జోహన్నెస్‌బర్గ్ బార్‌లో కాల్పులు… 14 మంది మృతి  – TNI  నేర వార్తలు

*దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్‌లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్‌లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

*కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరికి విముక్తి కల్పించినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. వీరిద్దరూ తమిళనాడుకు చెందినవారని, ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, హర్యానా పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో బాధితులకు విముక్తి కల్పించినట్లు వివరించారు.

*గుడివాడలో తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే విషాదం చోటుచేసుకుంది స్థానిక జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడి మహిళ మృతి చెందింది. సుమారు 55 సంవత్సరాలు వయసు కలిగిన మహిళపై విద్యుత్ వైరు తెగ పడటంతో ఈ ప్రమాదం సంబంధించినట్టు స్థానికులు తెలిపారు

*అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ ఆరోపించింది. తనను, భర్తను రివాల్వర్‌తో బెదిరించడమే కాకుండా వేధింపులకు గురిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ కేసులను పోలీసులు నమోదు చేశారు. సీఐ కోరట్ల నాగేశ్వరరావును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. బాధితురాలు, ఆమె భర్త స్టేట్మెంట్ నమోదు చేసిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. సీఐ నాగేశ్వరరావుకు సైతం కరోనా ఉండే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.

*మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఎన్‌హెచ్‌పై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి తమిళనాడు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు తమిళనాడుకు చెందిన శరణ్య(30), మిథున్‌(12)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కొమరోలు పోలీసులు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి రాముడు అనే వ్యాపారి రేషన్ బియ్యం ను తరలిస్తున్న ఆటోను కొమరోలు మండలం ఎడమకళ్లు సమీపంలో పోలీసుల స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు ఆటోలో దాదాపు 38 బస్తాల రేషన్ బియ్యం మరియు ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్న కొమురోలు పోలీసులు

*సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో ఓ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్ఛ రావడంతో ఓ ఆటో జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా నలుగురు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాకూబ్ అనే డ్రైవర్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా మునుపల్లి మండలం కంకోల్కు ఆటోలో బయలుదేరాడు. సరదాగా.. కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.

*భర్త డ్యూటీకి వెళ్లగా..ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దుండగులు చంపి.. నగలు ఎత్తుకెళ్లిన ఘటన విజయవాడ పరిధిలోని స‌త్య‌నారాయ‌ణ‌పురం రైల్వే క్వార్ట‌ర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భ‌ర్త ఉద్యోగానికి వెళ్ల‌డంతో ఒంట‌రిగా ఉన్న సీత‌మ్మ‌ ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. ట‌వ‌ల్‌ను గొంతుకు బిగించి హతమార్చారు. తర్వాత బీరువా ప‌గ‌లుగొట్టి నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళుతుండగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో శనివారం ఇద్దరు మృతి చెందారు. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ గ్రామానికి చెందిన కనపర్తి దినేష్‌ (23) వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే క్రమంలో పెదకాకాని వద్ద హైవేపై డివైడర్‌పై నడుస్తుండగా అకస్మాత్తుగా జారి ఆర్టీసీ బస్సు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో దినేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా పార్టీ నాయకులు, బంధువులు మంత్రి మేరుగ నాగార్జున వచ్చేవరకు మృతదేహాన్ని తరలించేందుకు నిరాకరించారు.

*గోవధకు సిద్ధం చేసిన 32 ఆవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలకు మేరకు శనివారం అర్ధం కాలనీలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేయగా 32 గోవులను కట్టేసి నలుగురు వ్యక్తులు సమీపంలో ఉన్నారు. పోలీసుల రాకను చూసిన ఇద్దరు పారిపోగా ఇద్దరు పట్టబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి, ఆవులను స్వాధీనం పర్చు కొని నగర పంచాయతీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

*అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లికి చెందిన రైతు(Farmer) నూర్ మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం నూర్ మహమ్మద్‌కు చెందిన పంపుసెట్లకు అధికారులు మీటర్లు బిగించారు. మోటార్ ఆన్ చేస్తే మీటర్ రీడింగ్ నమోదు అవుతుందంటూ నూర్ మహ్మద్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకు వచ్చారు. ప్రతి నెలా కరెంట్ బిల్లులు చెల్లించాలంటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని నూర్ మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

*శ్రీశైలం శిఖరం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినుకొండ నుండి శ్రీశైలం వస్తున్న కారు… శ్రీశైలం నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగాడు. తీరా గర్భవతిని చేసిన తర్వాత వివాహానికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి న్యాయం చేయాలంటూ శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలానికి చెందిన యువతి మక్కువ మండలంలోని ఓ గ్రామంలో ఉంటుంది. తల్లి కూడా వీరి వద్దే ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందిన చింతాడ రఘు అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ యువతికి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ప్రస్తుతం గర్భవతి అయిన యువతి వివాహం చేసుకోవాలని కోరడంతో ఆ యువకుడు నిరాకరించారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు సీతానగరం పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు మద్దతుగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఇందిర, సీపీఎం నాయకులు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. అయినా వారు శాంతించలేదు. ఇంతలో డీఎస్పీ సుభాష్‌ అక్కడకు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పడంతో యువతితో పాటు కుటుంబ సభ్యులు వెనుదిరిగారు.

*చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై ఇనుము లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీను మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు