తెలుగు సినిమా కలక్షన్లు పెరుగుతున్నాయి. స్టార్ హీరో సినిమా హిట్టయితే అవలీలగా రూ.200 కోట్లు వసూలు చేసేస్తోంది. దాంతో పాటు బడ్జెట్లు పెరుగుతున్నాయి. పారితోషికాలకు రెక్కలొస్తున్నాయి. ఇది వరకు తెలుగు సినిమా బడ్జెట్ రూ.100 కోట్లంటే అంతా ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు కొంతమంది హీరోలు వంద కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ పారితోషికం ఎప్పుడో వంద కోట్లు దాటేసింది. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ అంకెకు దరిదాపుల్లోనే ఉన్నారు.టాలీవుడ్లోని స్టార్ హీరోల్లో మహేష్ ఒకరు. నిన్నా మొన్నటి వరకూ ఆయన పారితోషికం రూ.50 కోట్లే. సర్కారు వారి పాట కోసం రూ.55 కోట్లు అందుకొన్నారని టాక్. ఇప్పుడు రూ.75 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం పట్టాలెక్కబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా కోసం మహేష్ రూ.75 కోట్లు అందుకుంటున్నారని టాక్. అంటే.. రూ.20 కోట్లు పెంచేశారన్నమాట. త్రివిక్రమ్ సైతం ఈ సినిమాకి రూ.25 కోట్ల పారితోషికం అందుకొంటున్నారని తెలుస్తోంది. అంటే.. హీరో, దర్శకుల పారితోషికాలు కలిపితే వంద కోట్లన్నమాట