దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ‘సీతారామం’ అనే చిత్రం రూపుదిద్దుకొన్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ తెరకెక్కించింది. హను రాఘవపూడి దర్శకుడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇందులో రష్మిక కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఆమె కథానాయిక కాదు కానీ…. కథని మలుపుతిప్పే పాత్ర అది. ఇందులో అఫ్రీన్ అనే ముస్లిం యువతిగా రష్మిక కనిపించనున్నారు. ఆదివారం బక్రీద్. ఈ సందర్భంగా ‘సీతారామం’లోని రష్మిక కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో.. ‘ఈద్ ముబారక్’ చెబుతున్న పోస్టర్ అది. 1965 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటికే టీజర్‌తో పాటు కొన్ని పాటలు విడుదలయ్యాయి. అవన్నీ ఈ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇటీవల బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్‌ని పరిచయం చేసింది చిత్రబృందం. మిలటరీ అధికారిగా.. సుమంత్ లుక్ కొత్తగా అనిపించింది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.