తిరుమలపై వేంచేసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన వాహన సేవలను మాడ వీధుల్లో నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 1న గరుడ సేవ జరుగనుందని చెప్పారు. సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి వివరించారు.
బూందీ పోటు ఆధునికీకరణపై అధ్యయనానికి ఆదేశం
తిరుమల బూందీ పోటు ఆధునికీకరణకు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయం, ధరల ఖరారుకు మార్క్‌ఫెడ్ అధికారులతో అవగాహన ఒప్పందం. శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులపై ఆగమ పండితులతో చర్చించి నిర్ణయం.
మావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కృష్ణారావు, పార్థసారధిరెడ్డి, మారుతీ ప్రసాద్, రాజేష్‌కుమార్‌శర్మ, మొరంశెట్టి రాములు, నందకుమార్, విద్యాసాగర్‌రావు, సనత్‌కుమార్, శశిధర్, మల్లీశ్వరి, శంకర్, విశ్వనాథ్, మధుసూదన్‌యాదవ్, సంజీవయ్య, వైద్యనాథన్ కృష్ణమూర్తి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.
అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు
తిరుమల: అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఏపీఎన్‌ఆర్టీఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి 9 నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు సోమవారంతో ముగిశాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు నిర్వహించారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు జరిగాయి. ఈ నెల 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డీసీ, 9న అట్లాంటా, 10న బర్మింగ్ హమ్ నగరాల్లో కల్యాణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు