DailyDose

కోర్ట్ ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకి జైలు, జరిమానా

కోర్ట్ ధిక్కరణ కేసులో  విజయ్ మాల్యాకి జైలు, జరిమానా

2017 నాటి కోర్ట్ ధిక్కరణ కేసులో దోషిగా తేలిన పలాయనదారు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ 4 నెలల జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. సుప్రీంకోర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి 4 వారాల్లోగా జరిమానా చెల్లించాలి. లేదంటే మరో రెండు నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని సుప్రీంకోర్ట్ హెచ్చరించింది. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని నిలబెట్టేందుకు తగిన శిక్ష విధించాల్సిందేనని ఈ సందర్భంగా కోర్ట్ వ్యాఖ్యానించింది.

కాగా కోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల(సుమారు రూ.317 కోట్లు)ను ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ మొత్తాన్ని వినియోగించడానికి వీల్లేదని, నిలుపుదల చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. 8 శాతం వడ్డీ సహా రూ.317 కోట్ల మొత్తాన్ని నాలుగు వారాల్లో తిరిగిచ్చేయాలని మాల్యా పిల్లలకు సూచించింది. నగదుని రిటర్న్ చేయకపోతే విజయ్ మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చునని తెలిపింది. నగదు రికవరీ ప్రక్రియలో సంబంధిత ఆఫీసర్‌కి భారత ప్రభుత్వం, అన్నీ ఏజెన్సీలు సహకరించాలని సుప్రీంకోర్ట్ సూచించింది.
జడ్జిలు యూయూ లిలిత్, ఎస్ రవీంద్ర భట్‌, పీఎస్ నరసింహలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. కోర్ట్ ధిక్కరణకు పాల్పడిన విజయ్ మాల్యాపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ ఈ తీర్పునిచ్చింది. విజయ్ మాల్యా నిబంధనలకు విరుద్ధంగా.. తన కొడుకు సిద్ధార్థ మాల్యా, కూతుర్లు లెన్నా మాల్యా, తన్యా మాల్యాలకు నగదును ట్రాన్స్‌ఫర్ చేశారు. కర్ణాటక హైకోర్ట్ ఆదేశాలకు ఇది విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నాయి. కాగా పలాయనం చిత్తగించిన విజయ్ మాల్యా భారతీయ బ్యాంకుల నుంచి దాదాపు రూ.9 వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేశాడు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట ఈ భారీ మొత్తంలో లోన్లు తీసుకున్న విషయం తెలిసిందే. 2016 నుంచి విజయ్ మాల్యా యూకేలోనే ఉంటున్నాడు.