NRI-NRTWorldWonders

ఎన్నారై పెళ్లిళ్లు.. 2 వేల మందికిపైగా మహిళలకు వేధింపులు..!

ఎన్నారై  పెళ్లిళ్లు.. 2 వేల మందికిపైగా మహిళలకు వేధింపులు..!

మహిళల అక్రమరవాణాపై పంజాబ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో కలల ప్రపంచాన్ని ఎరగా వేసి యువతులను ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ మహిళా కమిషన్, పంజాబీ, పంజాబ్ యూనిర్శిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నారై పెళ్లిళ్లపై ఇటీవల జరిగిన ఓ అవగాహన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఎన్నారై వివాహాలు విఫలమవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి బంధాల్లో చిక్కుకున్న మహిళలు శారీరక, మానసిక హింసకు గురవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మతో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

బాధిత మహిళల కోసం ఓ ప్రత్యేక హెల్ప్‌లైన్ అందుబాటులోకి తేవాలని గతనెలలోనే జాతీయ మహిళా కమిషన్ సూచించింది. అంతేకాకుండా.. బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ విషయంలో సూచనలు, సలహాలు స్వీకరించేందుకు కమిషన్ జూన్ 1న ఓ సమావేశం నిర్వహించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విదేశాల్లోని భారత సంతతి వారు(PIO), అక్కడే నివసిస్తున్న భారతీయులను(NRI) పెళ్లాడిన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సభ్యులు చర్చించారు. అంతేకాకుండా.. న్యాయం కోసం పోరాడుతున్న ఎన్నారై భార్యలు, విదేశాల్లోనే కాకుండా స్వదేశంలో ఎదుర్కొంటున్న న్యాయపరమైన సవాళ్లపైనా చర్చించారు.