బ్రిటన్ ప్రధాని పదవికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 8 మంది రేసులో నిలిచారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్, సుయెలా బ్రావెర్మన్ ఇందులో చోటు దక్కించుకున్నారు. మరో భారత సంతతి నేత ప్రీతి పటేల్.. పోటీ నుంచి తప్పుకున్నారు.
బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్, అటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్ చోటుదక్కించుకున్నారు. భారత సంతతికి చెందిన మరో కీలక నేత, హోం మంత్రి ప్రీతి పటేల్ మాత్రం తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ముందే ప్రకటించారు. ప్రస్తుతానికి తన దృష్టంతా హోం శాఖ బాధ్యతల నిర్వహణపైనే ఉందన్నారు. ప్రధాని పదవికి సునాక్, బ్రావెర్మన్ సహా మొత్తంగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, ఆర్థిక శాఖ నూతన మంత్రి నదీమ్ జహావా, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్, మాజీ మంత్రులు కెమీ బదెనోచ్, జెరెమీ హంట్, మరో నేత టామ్ టుగెంధాట్‌లు ఈ జాబితాలో ఉన్నారు. అత్యధిక మంది ఎంపీలు సునాక్‌ను బలపరిచినట్లు సమాచారం.
బుధవారం తొలి రౌండ్
పాకిస్థాన్ సంతతికి చెందిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సాజిద్ జావిద్, రెహ్మాన్ చిస్తీ ప్రధాని పదవికి పోటీ చేయాలని భావించినప్పటికీ.. నామినేషన్‌కు అవసరమైన కనీస మద్దతు (20 మంది ఎంపీల మద్దతు) కూడగట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కితగ్గారు. బరిలో ఉన్న 8 మంది అభ్యర్థులు బుధవారం తొలి రౌండ్ ఓటింగ్‌ను ఎదుర్కొంటారు. ఇందులో కనీసం 30 మంది ఎంపీల మద్దతు దక్కినవారే గురువారం జరగనున్న రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఈ నెల 21 నాటికల్లా పోటీలో ఇద్దరు అభ్యర్థులే మిగిలేలా తదుపరి రౌండ్లు
నిర్వహిస్తారు.
సెప్టెంబరు 5న ఎన్నిక
బ్రిటన్ నూతన ప్రధానిని కన్జర్వేటివ్ పార్టీ ఈ ఏడాది సెప్టెంబరు 5న ఎన్నుకోనుంది. ఈ మేరకు షెడ్యూలు ఖరారైంది. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైనవారే బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు. కన్జర్వేటివ్ హోం వెబ్‌సైట్ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వే- సునాక్ మూడో స్థానానికి పరిమితమవుతారని అంచనా వేసింది. పెన్నీ మోర్డాంట్ ప్రధాని పీఠం దక్కించుకుంటారని జోస్యం చెప్పింది. బదెనోచ్, సునాక్, బ్రావెర్మన్ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలుస్తారని తెలిపింది.