పాలు…పసిబిడ్డల నుంచి పెద్దవారి వరకూ అందరికీ నచ్చే, పుష్టిని, సత్తువని ఇచ్చే ఆహారం. నచ్చినా నచ్చకపోయినా అందరూ తప్పనిసరిగా పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఈ సందేశాన్ని అందరికీ చేరడానికి ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ, 2001 లో ప్రతి ఏటా జూన్ ఒకటవ తేదీని ప్రపంచ పాల దినోత్సవంగా జరపాలని నిశ్చయించింది. ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాలు మారథాన్లు, పాల ప్రదర్శనలు, స్కూళ్లలో కార్యక్రమాలు చేస్తున్నాయి. పాల వెనక ఉన్న కథ ఇది….
*క్రీస్తుపూర్వం పదివేల సంవత్సరాలకు ముందు, సంచార జాతులన్నీ కొన్ని కమ్యూనిటీలుగా ఏర్పడ్డాయి. పశువులు కూడా వారితోపాటే సెటిల్ అయ్యాయి. దాన్నే అగ్రికల్చర్ రివల్యూషన్ అన్నారు. అప్పటి నుంచి పాలు మనుషుల ఆహారంలో భాగం అయ్యాయి. కాని అందరికీ అందుబాటులో ఉండేవి కావు. అప్పట్లోఈజిప్టులో పాలు, డైరీ ఉత్పత్తులు కేవలం సంపన్నులు, పండితులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. పాలలో మత్తు కలిగించే పదార్థాలున్నాయి కాబట్టి మధ్యకాలంలో పాలను వర్చువస్ వైట్ లిక్కర్ అనేవారు. యూరోప్‌లో క్రీస్తుశకం ఐదవ శతాబ్దంలో పాలిచ్చే ఆవులు, మేకలకు బహుమానాలిచ్చే సంప్రదాయం ఉండేదట.
*పాల ప్రయాణం మేకలు, గొర్రెలు, యాక్, గేదెలు, గుర్రాలు, రెయిన్డీర్లు, ఒంటెలు, గాడిదలు, అన్నీ పాలిస్తాయి. జనం వాటన్నిటి పాలు తాగుతారు. పధ్నాలుగవ శతాబ్దం కల్లా మేకపాల కన్నా ఆవుపాలు ఎక్కువ ప్రాశస్తం పొందాయి. తర్వాత గేదె పాలు ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. పాలు త్వరగా పాడయిపోతాయి. కాబట్టి వాటిని నిలవ ఉంచే ప్రక్రియే పాశ్చరైజేషన్(పాలు మరగపెట్టడం). 1862 లోనే ఫ్రెంచి మైక్రోబయాలజిస్టులు పాశ్చరైజ్డ్ మిల్క్ పరీక్షలు జరిపారు. 1884 లో న్యూయార్క్‌లో మొట్టమొదటి పాల సీసా వచ్చింది. 1930 కల్లాపాలక్యాన్లప్రదేశంలో స్టోరేజ్ ట్యాంకులు వచ్చాయి. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న పేపర్ అట్టపెట్టెల్లో పాలు నిలవ చేయడం మొదలు పెట్టారు. 1914 లో పాలు సరఫరా చేసే ట్రక్కులు మొదలయ్యాయి. . దానితో పాలు ఎక్కువ మందికి చేరడం మొదలుపెట్టాయి. అలా మొదలైంది పాల ప్రయాణం.
**పాల ఉత్పత్తిలో మనమే ముందు
పోషకాల కోసం అన్వేషణ మొదలై పాలను తీసుకోవడం మంచిదని తెలుసుకున్నారు. ఆరోగ్యం బాగోలేని వ్యక్తులకు తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను ఇచ్చే క్రమంలో పాలు ఇచ్చేవారు. ఆవుపాలు పిల్లలకు, పెద్దలకు శ్రేష్ఠం అన్నది జగమెరిగిన సత్యం. పాల నుంచి తయారు చేసే క్రీమ్, వెన్న, పెరుగు, కెఫిర్, పనీర్, చీజ్, చాలా ఉత్పత్తులు వేటికవే విభిన్న రుచితో పాటు శరీరానికి మేలు చేస్తాయి. ప్రపంచం మొత్తం మీద ఆరు బిలియన్ల మంది పాలు, పాల ఉత్పత్తుల వినియోగదారులున్నారు. దాదాపు ఏడువందల యాభై మిలియన్లమంది డైరీ ఫార్మింగ్ మీద ఆధారపడి బతుకుతున్నారు. మనదేశంలో పట్టణ ప్రాంతాలు పెరిగిన తర్వాత పాలు కొనే శక్తి పెరిగింది. రోజువారీ ఆహార పదార్థాల్లో చోటు చేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా పాల అవసరాలు రెండు, మూడింతలు పెరుగుతున్నాయి. రష్యా, స్వీడన్లలో చిన్న మూస్ డైరీలు కూడా ఉంటాయి. పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు శాతం పాలు ఆవుల నుంచే అని ఎఫ్ ఎ ఒ చెప్పింది. పాలు, పాల ఉత్పత్తుల్లో మన దేశమే ముందుంది.
*పాలలో లెక్కలేనన్ని పోషకాలు షుగర్ లాక్టోజ్ ఒక్క పాలల్లోనే దొరుకుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత లాక్టేజ్, లాక్టోజ్లను అరిగించుకోడానికి అవసరమైన ఎంజైమ్ చిన్న పేగుల్లో ఉంటుంది. కాని పాలు క్రమం తప్పకుండా తాగకుంటే అది నెమ్మదిగా తగ్గిపోతుంది. అందుకే పిల్లలకు పుట్టగానే పాలు పట్టడం ఆరంభిస్తారు. మనిషి పుట్టిన దగ్గర నుంచి మొత్తం జీవన క్రమంలో పాలు ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు రోజూ తీసుకుంటే హైపర్ టెన్షన్, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. హోల్ మిల్క్‌లో నాలుగు శాతం కొవ్వు, సెమి స్కిమ్డ్ పాలలో రెండు శాతం కొవ్వు, స్కిమ్డ్ మిల్క్‌లో 0.3 శాతం కొవ్వు ఉటుంది. అరుగుదల స్థాయి, వయసు బట్టి ఎంచుకుని తాగాలి. ఒక గ్లాసు పాలలో ఒక వ్యక్తికి ఒక రోజుకి కావలసిన కాల్షియం ఉంటుంది. అరగ్లాసు పాలు పావు కిలో మాంసం, మూడు గుడ్లకి సమానం.మేకపాలే మంచివట ఆయుర్వేదం మేకపాలు మంచివని చెప్తుంది. ఆవు పాలకన్నా తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. మైగ్రేన్, తలనొప్పులు, ప్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్ తగ్గిస్తుంది. అయొడిన్ ఉండటం వలన థైరాయిడ్ రాకుండా చేస్తుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్స్ చర్మంలో మృత కణాలను తొలగిస్తుంది.
*ఏ టైమ్‌లో పాలు తాగడం మంచిది ఉదయాన్నే పాలు తాగడం ఉత్తమం. రాత్రి నిద్ర పోయే మూడు గంటల ముందు తాగితే మంచిది. పాలను కొద్దిగా కాచి గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలని చాలా ఎక్కువ సేపు మరిగించడం వలన పోషకాలు నశిస్తాయి. పాలలో పంచదార వేసుకుంటే శ్లేష్మం చేరుతుంది. పాలలో కాల్షియం స్థాయిలను తగ్గిస్తుంది. తేనె కలుపుకుని తాగచ్చు. పాలు తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం ఉంటుంది. అది తగ్గించాలంటే పాలలో తేనె, ఆరెంజ్ జ్యూస్ కలుపుకోవాలి. లేకుంటే బాదం, జీడిపప్పు, కిస్మిస్ను పాలకు చేర్చితే త్వరగా జీర్ణం అవుతాయి. పాలు తాగాక నిమ్మకాయ ముక్కను తినడం కూడా మంచిదే. లేదంటే కొంచం అల్లం పొడిని పాలకు కలిపి మరిగిస్తే మేలు జరుగుతుంది.