Food

ఎంతో మేలు.. ఖర్జూర పాలు!

ఎంతో మేలు.. ఖర్జూర పాలు!

వివిధ పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల అద్భుతమైన శక్తిని పొందవచ్చని చెబుతారు పోషక నిపుణులు. అలాంటి ఆహారమే.. ఖర్జూరం+పాలు. ఈ మిశ్రమం రోగాలను తగ్గిస్తుందని, నిరోధక శక్తిని పెంచుతుందని అధ్యయనాలు నిర్ధారించాయి.

గర్భధారణ సమయంలో..
మరో అధ్యయనం ప్రకారం.. ఖర్జూరం, పాలు కలిపి తాగడం గర్భిణులకు ప్రయోజనకరమని గుర్తించారు. గర్భస్థ పిండానికి అవసరమైన ప్రొటీన్‌, క్యాల్షియం, ఐరన్‌ దీనిద్వారా లభిస్తాయని గుర్తించారు.

ముడతల నివారణకు
పాలు, ఖర్జూరాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. దీంతో మేను మృదువుగా మారుతుంది. ఈ ఫలితం ఎండు ఖర్జూరాలు తిన్నప్పుడు కనిపించలేదట.

హిమోగ్లోబిన్‌
ఒక అధ్యయనంలో భాగంగా.. ఖర్జూరాలను పాలలో కలిపి ఉడికించారు. ఆ పాలను పదిరోజుల పాటు 18 నుంచి 55 ఏండ్ల వారితో పరగడుపున తాగించారు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేశారు. ఖర్జూర పాలు తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు.

సంతాన సాఫల్యతకు
ఖర్జూర పాలతో వంధ్యత్వాన్ని అధిగమించవచ్చని అంటారు. అందులోని ఫైటో కెమికల్స్‌ సంతానలేమి సమస్యను తగ్గిస్తాయి. వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. మహిళల్లో అండాశయ ఆరోగ్యాన్ని మెరుగు
పరుస్తాయి.

ఇంకొన్ని ప్రయోజనాలు..
గొంతులో గరగర పోతుంది. నిద్రలేమి సమస్య తీరుతుంది. అధిక రక్తపోటును నివారించవచ్చు. బాలింతలకు చనుబాల కొరత ఉండదు. ఎముకలు గట్టిపడతాయి. నరాల పనితీరు మెరుగుపడుతుంది.