Movies

సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను

Auto Draft

‘రెగ్యులర్‌ సినిమాల కన్నా బయోపిక్స్‌ కాస్త కష్టంగా, డిఫరెంట్‌గా ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆ పాత్ర పోషించడం అనేది ఇంకా కష్టం. నా కెరీర్‌లో చేసిన అత్యంత కష్టమైన పాత్రల్లో ‘శభాష్‌ మిథు’లో చేసిన పాత్ర ఒకటి’’ అన్నారు తాప్సీ. భారత మాజీ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శభాష్‌ మిథు’. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో తాప్సీ టైటిల్‌ రోల్‌ చేశారు. వయాకామ్‌ 18 సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘నాకు క్రికెట్‌ గురించి అంతగా తెలియదు. బ్యాట్‌ పట్టుకోవడం కూడా రాదు. చిన్నతనంలో ‘రేస్‌’, ‘బాస్కెట్‌బాల్‌’ వంటి ఆటలు ఆడాను కానీ క్రికెట్‌ ఆడలేదు. అందుకే ‘శభాష్‌ మిథు’ సినిమా ప్రాక్టీస్‌లో చిన్నప్పుడు క్రికెట్‌ ఎందుకు ఆడలేదా? అని మాత్రం ఫీలయ్యాను. ‘శభాష్‌ మిథు’ సినిమా క్రికెట్‌ గురించి మాత్రమే కాదు.. మిథాలీ రాజ్‌ జీవితం కూడా. అందుకే ఓ సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. మిథాలి జర్నీ నచ్చి ఓకే చెప్పాను.

ట్రెండ్‌ను బ్రేక్‌ చేయాలనుకునే యాక్టర్‌ని నేను. సమంతతో కలిసి వర్క్‌ చేయనున్నాను. ఈ ప్రాజెక్ట్‌ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు. ‘‘కవర్‌ డ్రైవ్‌ను తాప్సీ నాలాగే ఆడుతుంది. మహిళా క్రికెట్‌లో నేను రికార్డులు సాధించానని నా టీమ్‌ నాతో చెప్పారు. అయితే ఆ రికార్డ్స్‌ గురించి నాకు అంత పెద్దగా తెలియదు. కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌ ఉన్నప్పుడు అవి హ్యాపీ మూమెంట్స్‌ అవుతాయి. కీర్తి, డబ్బు కోసం నేను క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోలేదు. ఇండియాకు ఆడాలనే ఓ తపనతోనే హార్డ్‌వర్క్‌ చేశాను. నాపై ఏ ఒత్తిడి లేదు. నా ఇష్ట ప్రకారంగానే రిటైర్మెంట్‌ ప్రకటించాను’’ అన్నారు మిథాలీ రాజ్‌.