Business

విప్రోలో 3 నెలలకోసారి ప్రమోషన్లు!

Auto Draft

రికార్డు స్థాయికి పెరిగిన ఉద్యోగుల వలసల (ఆట్రిషన్‌)కు అడ్డుకట్ట వేసేందుకు దేశీయ ఐటీ కంపెనీ విప్రో సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. ప్రతిభావంతులైన, అర్హులైన ఉద్యోగులకు ఇకపై మూడు నెలలకోసారి ప్రమోషన్లను ఆఫర్‌ చేయాలని యోచిస్తోంది. అంతేకాదు, ఈ ఏడాది సెప్టెంబరులో చాలా వరకు సిబ్బంది వేతనాలను మరో 10 శాతం పెంచాలనుకుంటోంది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చేవారికి 15 శాతం వరకు హైక్‌ లభించే అవకాశం ఉంది. కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్‌తో పాటు ఈ రంగ కంపెనీల్లో ఉద్యోగుల వలసలు కూడా అనూహ్యంగా పెరిగాయి. దాంతో ఐటీ కంపెనీలు జీతాల పెంపు, బోనస్‌, ప్రమోషన్లు, కొత్త టెక్నాలజీల్లో శిక్షణ వంటి ప్రోత్సాహకాలతో ప్రతిభావంతులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన విప్రో ఆట్రిషన్‌ రేటు ఈ మార్చి త్రైమాసికంలో ఏకంగా 23.8 శాతానికి పెరిగింది. ఈ నెల 19న కంపెనీ విడుదల చేయనున్న ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ద్వారా నిర్దేశిత కాలానికి వలసలపై స్పష్టత రానుంది. జూన్‌తో ముగిసిన మూడు నెలలకు దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ ఆట్రిషన్‌ రేటు ఆరు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 19.7 శాతానికి పెరిగింది.

జర్మన్‌ కంపెనీ కొనుగోలు జర్మనీకి చెందిన హోక్రైనర్‌ జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విప్రో పీఏఆర్‌ఐ తెలిపింది. విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌కు చెందిన ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ వ్యాపార విభాగమే విప్రో పీఏఆర్‌ఐ. 1973 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న కుటుంబ యాజమాన్య సంస్థ హోక్రైనర్‌ జీఎంబీహెచ్‌లో ప్రస్తుతం 130 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పలు ఆటోమొబైల్‌ దిగ్గజాలకు ఈ సంస్థ ఆటోమేషన్‌ టెక్నాలజీ, అసెంబ్లీ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తోంది. విప్రో పీఏఆర్‌ఐ యూరప్‌ మార్కెట్లో మరింత బలోపేతమవడానికి ఈ కొనుగోలు కీలకం కానుంది.