13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం చీకటిలో జనించింది. కొన్ని వందల మిలియన్ల ఏళ్ల తర్వాతతొలి నక్షత్రాలు, గేలక్సీలు ఉనికిలోకి వచ్చి కూడా, నిన్నా, మొన్నటి వరకూ చీకట్లోనే మిగిలిపోయాయి.అవి వెలువరించే కాంతి ఆధారంగా, నిగూఢమైన వాటి ఆనవాళ్లనూ, రహస్యాలనూ తాజా జేమ్స్ వెబ్‌టెలిస్కోప్ వెలుగులోకి తీసుకురాగలిగింది. ఈ చారిత్రక టెలిస్కోప్ కెమెరాను అమెరికాకు చెందిన70 ఏళ్ల మహిళా ఖగోళ శాస్త్రవేత్త, డాక్టర్ మార్సియా జె రైకే రూపొందించడం విశేషం. టెలిస్కోప్‌రూపకల్పనలో పోషించిన పాత్ర గురించీ, ఎదుర్కొన్న సవాళ్ల గురించీ ఆమె ఏమంటున్నారంటే…
టెలిస్కోప్ తొలి చిత్రం పంపించినప్పుడు, సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాను. జేమ్స్‌వెబ్ టెలిస్కో్‌పలో కీలకమైన ఎన్‌ఐఆర్ క్యామ్ పరికరానికి బాధ్యత వహించడమనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఆశించిన ఫలితం దక్కినందుకు ఇప్పుడెంత సంతోషం కలుగుతోందో, ప్రారంభంలో పదే పదే డిజైన్‌ను మార్చవలసి వచ్చినప్పుడు అంతే నిరాశకు లోనయ్యాను. తర్వాత గత డిసెంబర్‌లో టెలిస్కో్‌పను విజయవంతంగా లాంచ్ చేయగలిగాం. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత దాని అద్దాలు, షీల్డ్‌లూ, ఇతరత్రా పరికరాలన్నీ ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా సక్రమంగా వాటి వాటి స్థానాల్లో అమరిపోయాయి. తాజాగా టెలిస్కోప్ పంపిన స్పష్టమైన చిత్రాలను చూడగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత క్రిస్మస్ రోజు రాకెట్ లాంచ్ అవడం నాకొక మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోయింది. దిశ, వేగం, ఇంధన వినియోగాలు అన్నీ సక్రమంగా జరిగిపోయాయి.
బృందం వల్లే సాధ్యపడిందిప్రారంభ డిజైన్ రూపకల్పనలో ఏరోస్పేస్ కంపెనీ లాక్‌హీడ్ ఇంజనీర్లు ఎంతో తోడ్పడ్డారు. మరీ ముఖ్యంగా మేం ఎన్‌ఐఆర్ క్యామ్‌ను గది ఉష్ణోగ్రతలో రూపొందించాం. అయినా అది పూర్తి చల్లదనంలో సైతం పూర్తి స్థాయిలో పని చేయగలగింది. గత ఫిబ్రవరిలోనే నాసా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించిన తొలి చిత్రాలను విడుదల చేసింది. అయితే అవి ఉర్సా మేజర్ నక్షత్రాల కూటమికి చెందిన 18 తారల చిత్రాలు. కానీ అవన్నీ మసకబారి ఉన్నాయి.
అంతరిక్షం వైపు పయనమిలా…
నాకు చిన్నప్పుడు ఇతర గ్రహాలను సందర్శించాలనే కోరిక ఉండేది. దాంతో అప్పటి నుంచే ఖగోళ శాస్త్రం, సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. హైస్కూలుకు వచ్చిన తర్వాత, బేబీ సిట్టర్‌గా పని చేసి, డబ్బులు కూడబెట్టుకుని, ఒక టెలిస్కోప్ కొనుక్కున్నా. అలా అంతరిక్షం మీద మొదలైన నా ఆసక్తి వయసుతో పాటు ఎదిగింది. అంతిమంగా వ్యోమగామిని కావాలనే ఆలోచనతో ‘మసాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (ఎమ్.ఐ.టి)లో చేరిపోయి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాను. కానీ ఆ ఇంజనీరింగ్ నాకంత ప్రోత్సాహకరంగా అనిపించలేదు. దాంతో నేను రంగాన్ని మార్చుకుని ఖగోళ శాస్త్రంలోకి అడుగు పెట్టాను. నేను ఫిజిక్స్ విద్యార్థిని కాబట్టి ఖగోళ శాస్త్రంలో తేలికగానే చోటు దక్కించుకోగలిగాను. 1960లో ఈ రంగంలోకి ప్రవేశించే మహిళల శాతం చాలా తక్కువ. వెయ్యి మంది విద్యార్థుల్లో 73 మంది మహిళలమే ఉండేవాళ్లం. వెస్టర్న్ సివిలైజేషన్ క్లాసులో మాత్రం నేనొక్కదాన్నే ఆడపిల్లను. మహిళల ప్రపంచ దృక్కోణం గురించి చెప్పవలసిన ప్రతి సందర్భంలో ప్రొఫెసర్ నా అభిప్రాయాన్ని అడిగేవారు.
మహిళలకు నా సలహా…
నాలా ఎదగాలని కోరుకునే మహిళలందరికీ నాదొక సలహా. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్)లో మహిళలను ప్రోత్సహించడం కోసం పిహెచ్‌డిని అందించే అన్ని రీసెర్చ్ సంస్థలూ వివిధ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటున్నాయి. వీటిలో చేరడానికి తటపటాయించే మహిళలు, సలహాలు, మద్దతు పొందే వీలున్న ప్రదేశాలను ఎంచుకోవాలి. ఖగోళ రంగానికి సంబంఽధించినంతవరకూ నేను స్వతంత్రంగా వ్యవహరించాను. కాబట్టే ఈ విజయం సాధ్యపడింది. అయితే కొందరు మహిళలకు తమ నైపుణ్యాల పట్ల ఆత్మవిశ్వాసం కొరవడుతోంది. ఇలా ఆత్మవిశ్వాసం లోపించిందని అనిపించినప్పుడు సాటి మహిళలతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. దాంతో ఆత్మవిశ్వాసం ఇనుమడించి, అనుకున్నది సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరూ మనసుకు నచ్చిన పనిని చేయాలి. ప్యాషన్‌ను కనిపెట్టి, దాని కోసం కృషి చేయాలి.