Business

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చేతికి డెన్మార్క్‌ సంస్థ!

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చేతికి డెన్మార్క్‌ సంస్థ!

లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో పట్టున్న డెన్మార్క్‌ కంపెనీ బేస్‌(బీఏఎస్‌ఈ) లైఫ్‌ సైన్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి నగదు రూపేణా 11 కోట్ల యూరోలు(రూ. 875 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలు ద్వారా లైఫ్‌ సైన్సెస్‌ డొమైన్‌లో మరింత నైపుణ్యాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా యూరోప్‌లో సేవలు విస్తరించనున్నట్లు పేర్కొంది. యూరప్, నార్డిక్స్‌ ప్రాంతంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సామర్థ్యాలు, క్లౌడ్‌ ఆధారిత పరిశ్రమ సొల్యూషన్స్‌ విస్తరణకు దోహదపడనున్నట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్‌)లో డీల్‌ పూర్తయ్యే వీలున్నట్లు అంచనా వేస్తోంది. బేస్‌ లైఫ్‌కు 200 మంది అత్యుత్తమ పరిశ్రమ నిపుణులున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఇన్ఫీ షేరు 0.7% పెరిగి రూ.1,448 వద్ద క్లోజైంది.