తులసి చెట్టు అంటే మనం పవిత్రంగా చూస్తాం. రోజూ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి పూజలు, వ్రతాలు కూడా చేస్తారు. ఇలా పవిత్రంగా పూజించే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తులసిని ఎలా తీసుకున్నా శరీరంమీద, మనస్సు మీద పాజిటివ్ ఫలితాలనే చూపిస్తుంది. గొంతు, నరాలు, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీకి సంబంధించిన రోగాల్లో తులసి మంచి ఫలితాలని నిస్తోంది. చౌకగా లభించే విలువైన ఔషధం తులసి.
*ఈ చెట్టు ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది. తులసి వేరునూ, శొంఠినీ సమపాళ్లలో తీసుకుని ఈ రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి. ఆ మాత్రల్ని ప్రతి రోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో సేవిస్తే, చాల రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తులసి, వెల్లుల్లిని నూరి, వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. ప్రతి రోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళనలు కూడా చాలావరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది.
*ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే, మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి. అల్లం రసంతో తులసి రసం కలుపుకుని తాగితే కడుపులో నులిపురుగులు తగ్గుతాయి. బెల్లంతో తులసి ఆకులని కలిపి తింటే కామెర్లు తగ్గుతాయి. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ వ్యాధులకు లేత తులసి ఆకులను టీ లో కలిపి ఉడికించి ఆ రసాన్ని తాగితే ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి. తులసి ఆకులను నమిలి ఆ రసాన్ని మింగితే జలుబు, ఫ్లూ లాంటివి తగ్గుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు గంధంతో పాటు తులసి ఆకులను నూరి ఆ మిశ్రమాన్ని తలకి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఆరు నెలల పాటు తులసి ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే క్రమంగా ఆ రాళ్ళు కరిగి మూత్రనాళం ద్వారా బయటికి వచ్చేస్తాయి. ఒత్తిడి తగ్గించుకోవాలంటే రోజుకు రెండుసార్లు కొన్ని తులసి ఆకులను నమిలి తింటే చాలు ఒత్తిడి నుండి మనల్ని కాపాడుకోవచ్చు.
*తులసి నాలుగు రకాలు ఉన్నాయి. రామతులసి, లక్ష్మీ, కృష్ణ, కర్పూర తులసి మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఔషధగుణాలు అన్నీ ఒక రకంగానే ఉంటాయి. ఈ చెట్టులోని గింజలు, పూలు, కాయలు, వేర్లు, అన్నీ ఔషధయుతమైనవే. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురదలు ఉన్నవారు తులసిని నిమ్మరసంతో కలిపి రాస్తే త్వరగా తగ్గుతాయి. మొటిమలకు తులసి ఆకులను నలిపి రాస్తే త్వరగా నయమవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు తులసి నుండి తీసిన నూనెను వేడిచేసి మోకాళ్ళ మీద రాస్తే నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు ప్రతి రోజూ స్నానం చేశాక తులసి చెట్టు చుట్టూ తిరిగితే ఆ చెట్టు గాలి వల్ల శరీరం మీద ఉన్న సూక్ష్మ జీవులు నశించిపోతాయి. ఇప్పటికైనా తులసి మొక్క ప్రయోజనాన్ని గుర్తించి ఇటు ఆధ్మాత్మికంగా, అటు ఆరోగ్యపరంగానూ మంచి ఫలితాలు పొందవచ్చు.