Health

అశ్వగంధతో… ఆరోగ్యం

అశ్వగంధతో… ఆరోగ్యం

ఇల్లు, ఆఫీస్‌ అంటూ పని ఒత్తిడితో ఆందోళనకు గురయ్యే అతివలకు అశ్వగంధ టీ అలసట తీర్చడమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్నీ ఇస్తుందంటున్నారు నిపుణులు. అలాగే సౌందర్యాన్నీ పరిరక్షిస్తుందని చెబుతున్నారు.పలు రకాల ఔషధగుణాలున్న అశ్వగంధతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కప్పు నీళ్లలో పావుచెంచా అశ్వగంధ పొడి వేసి మరిగించి వడకట్టాలి. ఇందులో అరచెక్క నిమ్మ రసం, చెంచా తేనె కలిపి టీ తయారుచేసి నిద్రపోయే ముందు తాగితే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివాటికి దూరంగా ఉండొచ్చు. కంటినిండా నిద్రపోవచ్చు. మానసిక ప్రశాంతత పొందడంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అంతేకాదు, ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడంతో అధికబరువు సమస్య నుంచి బయటపడొచ్చు. రక్తపోటును అదుపుచేసి, కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించడంతో మెనోపాజ్‌ తర్వాత ఎదురయ్యే హృద్రోగ సమస్యకు దూరంగా ఉండొచ్చు.

మెనోపాజ్‌లో
అశ్వగంధ టీ మెనోపాజ్‌ సమయంలో మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. 45-50 ఏళ్ల మధ్య నిద్రలేమి సమస్య మొదలైనవారు ఈ టీని ప్రతిరోజు తీసుకుంటే బయటపడొచ్చు. తరచూ మతిమరపు అనిపించినప్పుడు కాఫీ, టీలు తగ్గించి ఈ టీ కి ప్రాముఖ్యతనిస్తే చాలు. ఇది మెదడులో అసిటిల్‌కోలిన్‌ స్థాయులను పెంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపడేలా చేస్తుంది. కొంచెం సేపు పనిచేసినా అలసిపోతోంటే కప్పు అశ్వగంధ టీ తాగి చూడండి. ఇది నరాలను శక్తివంతమయ్యేలా మారుస్తుంది. దీంతో తిరిగి ఉత్సాహం దరిచేరుతుంది. ఇది ఫ్రీరాడికల్స్‌తో పోరాడి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్‌ అనారోగ్యాలకు తరచూ గురికాకుండా కాపాడుతుంది.

అందంలోనూ..
ఒత్తిడిలో కార్టిసోల్‌ హార్మోన్‌ విడుదలై, చర్మం ప్రభావితమై, మొటిమలు, మచ్చలు వంటి వాటికి కారణమవుతుంది. ఆ హార్మోన్‌ ప్రభావాన్ని చర్మంపై పడకుండా ఈ టీ కాపాడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. అశ్వగంధలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని ఒత్తిడికి గురి కాకుండా చేసి మృదువుగా మారుస్తాయి. కంటికింద నల్లని వలయాలు, ముడతలను దూరం చేస్తుంది. మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గించి, పిగ్మంటేషన్‌ సమస్యనూ రానివ్వదు.