పల్లెటూర్లలోనే కాదు మహానగరాల్లోనూ పాము మన ఇంటిముందుకో, మైదానంలోకో, రోడ్డుమీదికో వచ్చిందంటే చాలు దాని అంతు చూడకుండా వదలం. భారత్‌లో ప్రతి ఏటా వేల కొద్దీ పాములను అన్యాయంగా చంపేస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా పాము సమీపించిందంటే చాలు ప్రాణభయానికి గురై దాని ప్రాణం తీసుకుంటున్నాం. మన అవగాహన రాహిత్యం వల్ల పర్యావరణానికి మేలు చేసే పాముల జాతులు శరవేగంగా అంతరించి పోతున్నాయి. ఈ జాతులు క్షీణిస్తే ఎదురయ్యే అనర్థాలు పర్యావరణవేత్తలను కలవరపరుస్తున్నాయి.
పర్యావరణానికి మేలు చేసే పాముల జాతులు శరవేగంగా అంతరించి పోతున్నాయి. ఈ జాతులు క్షీణిస్తే ఎదురయ్యే అనర్థాలు పర్యావరణవేత్తలను కలవరపరుస్తున్నాయి. పాము కాటుకు ప్రజలు మరణిస్తుండటం.. అవి కనిపిస్తే చంపేస్తుండటంతో నానాటికీ వీటి సంఖ్య తగ్గిపోతోంది. రైతు నేస్తం అయిన ఈ జాతి అంతరిస్తే పర్యావరణ సమతుల్యం తగ్గుతుంది. పంటలను దెబ్బతీసే ఎలుకలను పాములు వేటాడి తింటాయి. ఒక్కో పాము రోజుకు సగటున అయిదు నుంచి పది ఎలుకల్ని తింటుంది. కొండచిలువ రోజుకు 50 ఎలుకలను మింగేస్తుంది. ఇవి లేకపోతే ఎలుకల సంఖ్య ఇబ్బడి ముబ్బడి పెరిగి ప్రజలకు ఆహారధాన్యాలు మిగలవు. పాముల ప్రాముఖ్యతను తెలియజేసి వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జులై 16న ‘ప్రపంచ పాముల దినోత్సవం’ నిర్వహిస్తుంటారు.
నల్లమలలో నాగుపాము, రక్త పింజర, కట్లపాము, చిన్నపింజర వంటి విషపూరిత పాములతో పాటు పసిరిక, జెర్రిపోతు, రెండు తలల పాము, మట్టి పాముల వంటి విషరహిత పాములు ఉన్నాయి. పాము కరిచిన తర్వాత విష ప్రభావం కన్నా భయంతో, గుండెపోటుతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. విషపూరిత పాము కుట్టిన మూడు గంటలలోపు సరైన వైద్యం అందితే ప్రాణ హాని ఉండదు. అటవీ ప్రాంతంలో ఉండే పాముల సంరక్షణతో పాటు మైదాన ప్రాంతాల్లో సంచరించే వాటి రక్షణకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది.
“పాములతో మానవాళికి కలిగే ప్రయోజనాలు, అవి కరవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరచినా తీసుకోవాల్సిన వైద్యం, కనిపిస్తే చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్యాకుమెంటరీ తయారు చేశాం. మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెంలో స్నేక్ రెస్కూర్లను నియమించాం. ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా శనివారం పెద్దదోర్నాలలో పాములపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాం.” – విశ్వేశ్వరరావు, అటవీ రేంజర్, దోర్నాల.