రాణి పాత్ర అనగానే గుర్తుకొచ్చేలా ‘జోధా అక్బర్’లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఐశ్వర్యరాయ్. ప్రస్తుతం అలాంటి మరో పాత్రలో నటిస్తున్నదీ నీలికళ్ల సుందరి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో రాణి నందినిగా, రాణి మందాకినీదేవిగా.. ద్విపాత్రాభినయంతో కనికట్టుచేయనున్నది. ఈ చిత్రంలో ఐశ్వర్య ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. ఇందులో, కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఆమె రూపాన్ని తీర్చిదిద్దారు.రాణెమ్మల కోసం హైదరాబాద్‌లోని కిషన్‌దాస్ అండ్ కో సంస్థతో ఆభరణాలు డిజైన్ చేయించారు. మొత్తం పద్దెనిమిది మంది స్వర్ణకారుల బృందానికి ప్రతీక్షా ప్రశాంత్ చీఫ్ డిజైనర్ వ్యవహరిస్తున్నారు. ఆరునెలలపాటు ఎంతో పరిశోధన చేసి చోళుల కాలంనాటి నెక్లెస్‌లతో పాటు జుంకాలు, వంకీలు, ఉంగరాలు, పాపిట బిళ్లలు, హారాలు తదితరాలకు జీవం పోశారు. ఈ ఆభరణాల సంస్థకు నూట యాభయ్యేళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ నిజాములకు కూడా కిషన్‌దాస్ అండ్ కో నగలను రూపొందించి ఇచ్చేదట. ఆ నగధగలతో మెరిసిపోయే ఐశ్వర్యను వెండితెర మీద చూడాలంటే మాత్రం సెప్టెంబరు దాకా ఆగాల్సిందే!