Movies

నవ్వే మంత్రం

నవ్వే మంత్రం

అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగింది రష్మిక. పలు భాషల్లో పనిచేసే అవకాశంతోపాటు భాషా దోషాలు, తన రూపం, దుస్తులపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్‌ అన్నీ ఒత్తిడిని నింపేవేనట. ‘‘ప్రపంచానికి నీ బలహీనతల్ని ఎప్పటికీ చూపించకు’.. చిన్నతనం నుంచీ అమ్మ చెప్పిన మాట ఇది. అందుకే పరిస్థితితో సంబంధం లేకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా. సెట్‌లో అడుగుపెట్టడంతో ఒత్తిడి మొదలు. స్క్రిప్ట్‌, గుర్తుంచుకోవాల్సిన డైలాగులు.. దానికి తగ్గ హావభావాలను గమనించుకుంటూనే దర్శకుడిని ఒప్పించాలి మరి! దీనికితోడు రూపురేఖలు, మాటతీరు, వస్త్రాలు అన్నింటిపైనా ట్రోలింగ్‌. భరించలేని కామెంట్లు. మొదట్లో ఇంట్లో వాళ్లకి, స్నేహితులకీ చెప్పి వాళ్లని ఆందోళన పెట్టకూడదని నేనే భరించేదాన్ని. ఏడుస్తూ నిద్రపోయిన రాత్రులెన్నో. ఇంతమంది చెబుతున్నారంటే నన్ను నేను మార్చుకోవాలేమో అనుకొని ప్రయత్నించా. అయినా ఆ వ్యాఖ్యలు ఆగలేదు. దీంతో నవ్వి ఊరుకోవడం మొదలుపెట్టా. ఇప్పుడు ఏదైనా విషయం ఇబ్బంది కలిగిస్తోందా.. జిమ్‌కెళ్లి అలసిపోయేలా వర్కవుట్లు చేస్తా. పెద్ద సౌండ్‌తో పాటలు వింటా, విపరీతంగా డ్యాన్స్‌ చేస్తా. వ్యాయామం ఎలాగూ చేస్తా కాబట్టి, నచ్చినంత ఐస్‌క్రీమ్‌ తినేస్తా. కొరియన్‌ సినిమాలూ, బీటీఎస్‌ వీడియోలూ ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చేశాయి’ అంటోందీ కన్నడ అమ్మాయి.