Politics

వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల తక్షణ సాయం

వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల తక్షణ సాయం

వరద బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. వరద పరిస్థితుల ముప్పు అనంతరం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా నెలాఖరు వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో వంతెన పైనుంచి గోదావరి ఉద్ధృతిని పరిశీలించారు. అనంతరం ఐటీడీఏలో ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు పునరావాస కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.
సింగరేణి, ప్రభుత్వం కలిపి రూ.వెయ్యికోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారు. గోదావరికి 90 అడుగుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ఎత్తైన ప్రాంతంలో కాలనీ నిర్మాణానికి సీఎస్‌ చర్యలు తీసుకుంటారన్నారు. వరద పరిస్థితుల ముప్పు తర్వాత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని.. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని.. తదుపరి పర్యటనలో దీనిపై పర్యవేక్షిస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.