బ్రిటన్ ప్రధాని రేసులో భారత-సంతతికి చెందిన బ్రిటిషర్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా నేపథ్యంలో.. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన టోరీ సభ్యులు తదుపరి నేతను ఎన్నుకోవాల్సి ఉన్న విషయం తెలిసిందే. అలా ఎన్నికైన నేత ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే రెండు రౌండ్ల పోలింగ్‌లో సునాక్ సునాయాసంగా అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నారు. రెండు రౌండ్ల తర్వాత బరిలో ఐదుగురు నిలవగా.. గురువారం మరో రౌండ్ పోలింగ్ జరగనుంది. అయితే.. అధికార పార్టీ టోరీ సభ్యుల్లో చాలా మంది రిషి వైపే మొగ్గుచూపుతున్నట్లు జేఎల్ పార్ట్నర్స్ ఆదివారం నిర్వహించిన ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. రిషిని ఎన్నుకుంటే.. ఓ మంచి ప్రధానిగా ఉండగలరంటూ 48ు(సుమారు 4,400) మంది టోరీ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. ఇక రిషికి గట్టిపోటీ ఇస్తున్న విదేశాంగ మంత్రి లీజ్ట్రూజ్ 39ు ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఒపీనియన్ పోల్స్‌లో పలు ప్రశ్నలపై సర్వే నిర్వహించగా.. సింహభాగం మద్దతు రిషికే ఉన్నట్లు తేలిందని జేఎల్ పార్ట్నర్స్ వెల్లడించింది.