డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను సొంతం చేసుకొంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-9, 11-21, 21-15తో అన్‌సీడెడ్ వాంగ్ జి యి (చైనా)పై నెగ్గింది. ఈ సీజన్‌లో సింధుకిది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ 300, స్విస్ ఓపెన్ 300 టైటిళ్లు అందుకుంది. అంతేకాదు.. ఓవరాల్‌గా సింధు కెరీర్‌లో ఇదే తొలి సూపర్ 500 టైటిల్ కావడం విశేషం. గతంలో సూపర్ 500 టోర్నీలు థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్‌లో ఫైనల్ చేరినా, రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే..
ఆరంభంలో వాంగ్ రెండు పాయింట్లతో పైచేయి సాధించినా.. ఆ తర్వాత దీటైన రిటర్న్‌లు, ర్యాలీలతో విరుచుకుపడిన సింధు వరుసగా 11 పాయింట్లు సాధించి బ్రేక్‌కు వెళ్లింది. తర్వాత కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 21-9తో గేమ్‌ను ఖాతాలో వేసుకొంది. అయితే, రెండో గేమ్‌లో దూకుడుగా ఆడిన వాంగ్ 21-11తో నెగ్గి మ్యాచ్ ఫలితాన్ని మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడడంతో 5-5తో సమమైంది. ఈ దశలో జాగ్రత్తగా ఆడిన సింధు 11-6తో ముందంజ వేసింది. అయితే, పట్టువీడని వాంగ్ వడివడిగా పాయింట్లు సాధిస్తూ 11-12తో ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, సింధు మరో 4 పాయింట్లు గెలిచి ముందుకెళ్లింది. మరోవైపు వాంగ్ తెలివిగా షటిల్‌ను డ్రాప్ చేస్తూ భారత షట్లర్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసినా.. తన ట్రేడ్‌మార్క్ స్మాష్‌లతో సింధు 18-14తో పైచేయిగా నిలిచింది. అదే ఊపులో 21-15తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను నెగ్గింది.
‘కామన్వెల్త్’పై ఫోకస్ – సింధు
‘సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ సాధించడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఈ టైటిల్ ఫైట్ ఒక మంచి మ్యాచ్‌గా గుర్తుండిపోతుంది. ఈ విజయంతో లభించిన ఉత్సాహాన్ని వచ్చే టోర్నమెంట్లలోనూ కొనసాగిస్తా. మూణ్నెళ్లుగా వరుస పెట్టి టోర్నమెంట్లు ఆడుతున్నా. రెండ్రోజుల పాటు చిన్న విరామం తీసుకుని కామన్వెల్త్ క్రీడలపై ఫోకస్ పెడతా. కామన్వెల్త్ పోటీల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ శిబిరంలో సన్నాహకాలు ప్రారంభిస్తా’