Devotional

తిరుమలలో వేడుకగా పుష్పపల్లకీ సేవ – ఆధ్యాత్మిక వార్తలు

తిరుమలలో వేడుకగా పుష్పపల్లకీ సేవ – ఆధ్యాత్మిక వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగాలను సూచిస్తూ శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుడి ప్రతిమలను పల్లకీపై కొలువుదీర్చారు. 5 రకాల సంప్రదాయ పుష్పాలు, 5 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు ఈ పుష్ప పల్లకీ సేవకు వినియోగించారు. ఈరోడ్ పట్టణానికి చెందిన దాత సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఆల‌య డిప్యూటీ ఈఓ ర‌మేష్‌బాబు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీ‌హ‌రి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీఓ బాలిరెడ్డి తదిత‌ర అధికారులు పాల్గొన్నారు.

2. శ్రీవారి ఆలయంలో శాస్ర్తోక్తంగా ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం ఆదివారం శాస్ర్తోక్తంగా జరిగింది. పెద్ద, చిన్న జీయర్‌ స్వాములు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద వస్ర్తాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయర్‌ స్వామి, ఈవో ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట వచ్చారు. ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.

3. వైభవంగా గోల్కొండ, లాల్‌ దర్వాజ బోనాలు
లష్కర్‌ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలతో తరలివచ్చిన మహిళలు, పోతరాజుల విన్యాసాలతో లష్కర్‌ పుర వీధులు భక్తి సంద్రంలో ఓలలాడాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు వెంటరాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. గోల్కొండ, లాల్‌ దర్వాజ బోనాలు ఘనంగా జరిగాయి.

4. మైసమ్మ దేవతను దర్శించుకున్న మందా జగన్నాథ్‌
మండల పరిధిలోని నాయి నోనిపల్లి మైసమ్మ దేవతను నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ, టీఆర్‌ ఎస్‌ అధికార ప్రతినిధి మంద జగన్నాథం దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, ఈవో సత్యచంద్రారెడ్డిలు మందా జగన్నాథ్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పెద్దకొత్తపల్లి జడ్పీటీసీ మేకల గౌరమ్మ మైసమ్మ దేవతను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అతని వెంట నాయినోనిపల్లి మైసమ్మ చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌, మైసమ్మ ఈవో సత్యచంద్రారెడ్డి, కొల్లాపూర్‌ మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, దళితబంధు పథకం కో ఆర్డినేటర్‌ కాటం జంబులయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కేశవులు, మేకల చంద్రయ్య, ఎండోమెంట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

5. రామప్ప ఆలయంలో భక్తుల సందడి
వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు సందర్శించారు. ఆలయంలోని రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ తీర్థప్రసాదాలు ఆలయంలో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. రామప్ప సరస్సును సందర్శించి బోటింగ్‌ చేశారు. కాగా, ఆలయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శక్తికాంత్‌ సింగ్‌ ఐఎఫ్‌ఎస్‌, అన్సాల్‌ సుతార్‌, కిరణ్‌మాలీ సందర్శించారు. అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజల తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్‌ ద్వారా తెలుసుకొని, ఇంత అద్భుత శిల్పాలు నాటి కళాకారుల పనితీరుకు నిదర్శనం అన్నారు. భూపాలపల్లి అడిషనల్‌ డీఆర్‌డీవో అంజయ్య, ఆర్‌ఐ ఉన్నారు.