సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దర్జా’. పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతున్నది. చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ…‘స్క్రీన్ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. చాలాకాలం తర్వాత ఇలాంటి కథ తెరపైకి వస్తుందని చెప్పగలను. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతాయి’ అన్నారు. నటి అనసూయ మాట్లాడుతూ…‘ఈ సినిమాలో కనకం అనే పాత్రలో ఆకట్టుకుంటాను. మిమ్మల్ని భయపెట్టే క్యారెక్టర్ నాది. నాయికకు ప్రాధాన్యమున్న సినిమా దక్కడం సంతోషంగా ఉంది. ఓటీటీలో వస్తుందని వేచి చూడకుండా ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని కోరుతున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకుడు బుచ్చిబాబు, హీరో సందీప్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.