ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అనే అన్నమయ్య కీర్తనని ఆమె ఆలపించి, దానికి అభినయం జోడించి ఓ వీడియోని రూపొందించి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. దీనిపై అన్నమయ్య వంశీకులు అభ్యంతరం తెలిపారు. ఈ వీడియోలో శ్రావణ భార్గవి పుస్తకం చదువుతూ, కాళ్లు ఊపుతూ, తినుబండారాలు తింటూ కనిపించారు. అన్నమయ్య కీర్తనను తనకు తాను అన్వయించుకొని, కాళ్లు ఊపుతూ, అలా అసభ్యకరంగా అభినయించడం అన్నమయ్య కీర్తనని అపహాస్యం చేసినట్టే అని అన్నమయ్య అనువంశీకులైన తాళ్లపాక వెంకట రాఘవ అన్నమాచార్యులు విచారం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ కోరుతూ శ్రావణ భార్గవిని ఫోన్లో సంప్రదిస్తే… నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, సంస్కారం లేకుండా మాట్లాడారని ఆరోపించారు. ఈ వీడియోని వెంటనే డిలీట్ చేయాలని, జరిగిన దానికి శ్రావణ భార్గవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య కీర్తనల్ని వెంకటేశ్వరస్వామికి అంకితం చేశారని, ఎవరు ఆ పాటల్ని ఆలపించినా, అభినయించినా అన్నమయ్య కీర్తి ప్రతిష్ఠలను, సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్నమయ్య కుటుంబీకులు కోరుతున్నారు. ఈ పాటకు శాస్ర్తియంగా నృత్యం చేసి, అభినయిస్తే తప్పు లేదని, ఓ వివాహిత అయి, కాళ్లకు మెట్టెలు కూడా లేకుండా కనిపించడం సంప్రదాయం కాదని హితవు పలికారు. దీనిపై శ్రావణ భార్గవి కూడా స్పందించారు. ‘‘ఓ శృంగార కీర్తనను ఓ అమ్మాయి అభినయిస్తే తప్పేంటి? కాళ్లు ఊపడంలో ఆశ్లీలం ఏముంది?’’ అని ఆమె ప్రశ్నించారు. తాను కూడా బ్రాహ్మణ మహిళే అని, తనకు సంప్రదాయాలు తెలుసని, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పాటని రూపొందించామని, దైవాజ్ఞ లేకపోతే ఆ వీడియో బయటకు వచ్చేది కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ‘‘దుప్పటి కప్పుకొన్న అమ్మాయి కూడా ఆశ్లీలంగా కనిపిస్తే మీ చూపులోనే తేడా ఉన్నట్టు’’ అంటూ శ్రావణ భార్గవి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.