NRI-NRT

గతేడాది 1.6 లక్షల పైచిలుకు భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు

Auto Draft

గతేడాది 1.6 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు తాజాగా తేలింది. 2020లో మొత్తం 85,256 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా 2021లో ఈ సంఖ్య దాదాపు రెట్టింపైంది. హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్.. పార్లమెంటులో మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ సభ్యుడు, బీఎస్పీ నేత అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. హోం శాఖ తాజా గణాంకాల ప్రకారం.. 2021లో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య 1,63,370. ఇక 2019లో 1,44,017 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. దేశాన్ని వీడుతున్న వారిలో అత్యధికులు అమెరికాలో సెటిలవుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2020లో 30,828 మంది భారతీయులు దేశాన్ని వీడి అమెరికా పౌరసత్వం తీసుకుంటే.. 2021లో ఈ సంఖ్య రెండింతల కంటే ఎక్కువే పెరిగింది. ఆ ఏడు మొత్తం 78,284 మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇక అమెరికా తరువాత భారతీయులను అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశం ఆస్ట్రేలియా! 2020లో 13518 మంది, 2021లో 23533 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని స్వీకరించారు. ఇటీవల కాలంలో కెనడాకు కూడా భారతీయులు క్యూ కడుతున్నారు. అయితే..2021లో మాత్రం ఈ జోరు కాస్త తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది మొత్తం 21,597 మంది కెనడా పౌరసత్వం పుచ్చుకున్నారు. ఇక విదేశాల్లో సెటిలయ్యేందుకు భారతీయులు ఎంచుకుంటున్న దేశాల్లో.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, ఇటలీ, సింగపూర్, జర్మనీ, ది నెదర్‌ల్యాండ్స్, స్వీడెన్ టాప్ టెన్ స్థానాల్లో ఉన్నాయి.