తిరుమలలో బుధవారం పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ వేడుక నిర్వహించనున్నది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్నాటక సత్రానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూ వస్తున్నది. మొదట్లో ఈ ఉత్సవాన్ని ‘తోటోత్సవం’ అని పిలిచేవారు. ఈ ఉత్సవంలో కర్నాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.
**చారిత్రక ప్రాశస్త్యం
శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తిభావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన ఆభరణాలు బహూకరించారు. అదేవిధంగా బ్రహ్మూత్సవాల్లో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.
**కొనసాగుతున్న ఆనవాయితీ
ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరఫున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజీల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికీ కొనసాగుతున్నది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాల్లో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా మలయప్పస్వామివారు కర్నాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.